- అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టే ప్లాన్
- ఆర్థికరంగ బలోపేతానికి చైనా బంగారం వేట!
- ఇండోనేషియా, ఘనా దేశాల్లో గోల్డ్ డింగ్గింగ్
- డాలర్‌పై ఆధారపడకుండా ఉండటమే లక్ష్యం
- అంతర్జాతీయ ఆధిపత్యానికి డ్రాగన్ వ్యూహం
సహనం వందే, చైనా:
అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ ఇప్పుడు బితుకు బితుకుమంటూ కాలం వెళ్లదీస్తుంది. అలాగే ఒకనాడు సోవియట్ రష్యా అమెరికాతో ఢీ అంటే ఢీ అన్నట్లు శాసించి కనుమరుగైపోయింది. అలాగే అమెరికా కూడా ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని డ్రాగన్ కంట్రీ చైనా కలలు కంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ ఆర్థిక రంగంలో తన శక్తి యుక్తులను పెంచుకోవడానికి చైనా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది.
డాలర్‌కు ప్రత్యామ్నాయం…
అమెరికా డాలర్ కు చైనా కరెన్సీ యాన్ మధ్య తేడా ఉంది. ఒక డాలర్ 7.18 యాన్ లతో సమానం. దీంతో చైనా తన ఆర్థిక వ్యవస్థను డాలర్ ఆధిపత్యం నుంచి విముక్తం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా ఆంక్షల ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవడానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో పటిష్ఠమైన స్థానాన్ని సంపాదించడానికి బంగారంపై దృష్టి పెట్టింది.

పెద్ద మొత్తంలో బంగారాన్ని సేకరించడం ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన భద్రత కవచాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఈ వ్యూహం భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రాముఖ్యతను తగ్గించి, చైనా కరెన్సీకి ప్రాధాన్యత పెంచడానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే చైనా, దానిని తన ఆర్థిక శక్తికి ప్రధాన సాధనంగా మలుచుకుంటోంది.
గ్లోబల్ సౌత్ దేశాల్లో బంగారం తవ్వకాలు…
బంగారానికి ఉన్న అధిక డిమాండ్ కారణంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో తవ్వకాల వేగం పెరిగింది. ఇండోనేషియా, ఘనా, ఫ్రెంచ్ గయానా వంటి దేశాల్లో చైనా బంగారం తవ్వకాలు చేపట్టింది. చైనాకు చెందిన కంపెనీలు ఈ దేశాల్లోని గనులపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ తవ్వకాల వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. ఇవి అక్కడి ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణపై దృష్టి…
బంగారం తవ్వకాల వల్ల పర్యావరణంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది. మైనింగ్ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు నదులను, ఇతర జల వనరులను కలుషితం చేయకుండా చర్యలు తీసుకోవాలి. అడవులను నరికివేయడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం వంటివి కూడా ముఖ్యమైన అంశాలు. ఈ విషయంలో చైనా, గ్లోబల్ సౌత్ దేశాల ప్రభుత్వాలు సహకరించుకుని, పర్యావరణానికి నష్టం జరగకుండా తగిన నియమ నిబంధనలను రూపొందించుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.