- ‘మార్వాడీలు గో బ్యాక్’ అంటూ పోరాటాలు
- రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్న నినాదం
- సౌత్ లో 5 కోట్ల మంది నార్త్ ఇండియన్స్ పాగా
- ఐదేళ్లలో రూ. 18 లక్షల కోట్లు నార్త్ కు సరఫరా
- ఇక్కడి సొమ్ము తరలించుకుపోతున్న వైనం
- గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించిన వ్యాపారాలు
- డీలిమిటీషన్లోనూ దక్షిణాదికి తీవ్ర అన్యాయం
- నేడు ఆమనగల్లు బంద్ కు పిలుపు
- నార్త్ ఇండియన్స్ గో బ్యాక్: సౌత్ సేన పిలుపు
సహనం వందే, హైదరాబాద్:
దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాధిపత్యం ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంటుంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో మార్వాడీ గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో వ్యాపారులు సోమవారం మార్వాడి గో బ్యాక్ అంటూ బంద్ కు పిలుపు ఇచ్చారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేయాలని కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణకార సంఘం విజ్ఞప్తి చేసింది.
నార్త్ నుంచి ఐదు కోట్ల మంది వలస…
సౌత్ ఇండియా రాష్ట్రాల్లో నార్త్ ఇండియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక అంచనా ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు సుమారు 5 కోట్ల మంది ఉండొచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో నార్త్ ఇండియన్ల ప్రభావం అసాధారణంగా ఉంది. చిన్న దుకాణాల నుంచి పెద్ద రిటైల్ వ్యాపారాల వరకు, వీధి వ్యాపారుల నుంచి రియల్ ఎస్టేట్ వరకు వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
చెన్నైలో టెక్స్‌టైల్, ఆహార వ్యాపారాల్లో గుజరాతీ, రాజస్థానీ వ్యాపారులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బెంగళూరులో ఐటీ రంగంలో ఉత్తరాది వ్యాపారవేత్తలు, ఉద్యోగులు స్థానికులతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ఆధిపత్యం స్థానిక వ్యాపారులకు సవాలుగా మారింది. హైదరాబాదులో వైశ్యుల వ్యాపారాలన్నింటినీ నార్త్ ఇండియన్ వ్యాపారులు కబ్జా చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ…
గ్రామీణ ప్రాంతాల్లోనూ నార్త్ ఇండియన్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరి, పత్తి పొలాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడానికి సిద్ధపడటం వల్ల వీరు స్థానిక కూలీలకు పోటీగా మారుతున్నారు. ఇది కొన్ని ప్రాంతాల్లో స్థానికుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.
రాజకీయ వెనుకబాటుతనం…
రాజకీయంగా సౌత్ ఇండియా వెనుకబడి ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. లోక్‌సభలో నార్త్ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు (ఉత్తరప్రదేశ్-80, బీహార్-40) ఉండగా, సౌత్ రాష్ట్రాల సీట్లు తక్కువ (తమిళనాడు-39, ఆంధ్రప్రదేశ్-25). ఈ అసమానత కేంద్రంలో నిర్ణయాధికారంలో నార్త్ రాష్ట్రాల పైచేయిని చూపిస్తోంది. 2026 డీలిమిటేషన్ ఈ గ్యాప్‌ను మరింత పెంచే అవకాశం ఉందని సౌత్ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజలు చెల్లించే పనుల్లో నార్త్ దోపిడి…
దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, తిరిగి వెనక్కు వచ్చే నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి రూ. 22 లక్షల కోట్లు ఇస్తే, తిరిగి వెనక్కు వచ్చింది కేవలం రూ. 6 లక్షల కోట్లు మాత్రమే అని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఒక అంచనా ప్రకారం గత ఏడాది…
- తమిళనాడు: రూ. 1.2 లక్షల కోట్లు ఇస్తే, రూ. 40,000 కోట్లు వచ్చాయి.
- కర్ణాటక: రూ. 1 లక్ష కోట్లు ఇస్తే, రూ. 30,000 కోట్లు వచ్చాయి.
- ఆంధ్రప్రదేశ్: రూ. 1.5 లక్షల కోట్లు ఇస్తే, రూ. 40,000 కోట్లు వచ్చాయి.
- తెలంగాణ: రూ. 1.7 లక్షల కోట్లు ఇస్తే, రూ. 45,000 కోట్లు వచ్చాయి.
- కేరళ: రూ. 50,000 కోట్లు ఇస్తే, రూ. 15,000 కోట్లు వచ్చాయి.

నార్త్ ఇండియన్స్ గో బ్యాక్: సౌత్ సేన పిలుపు
దక్షిణాదిలో ఉత్తరాది ఆధిపత్యం కొనసాగుతోందని సౌత్ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్వాడీలతో సహా ఉత్తరాది ప్రాంతాల వలసదారులు దక్షిణాది రాష్ట్రాలను విడిచిపోవాలని సౌత్ సేన నేతలు రవి, శ్రీనివాస్, రమేష్, జగదీష్ డిమాండ్ చేస్తున్నారు. ఆమనగల్లు బంద్ కు వాళ్ళు మద్దతు ప్రకటించారు.