అబార్షన్ల మాఫియా – తుంగతుర్తిలో నకిలీ వైద్యుడి దందా

  • గర్భిణీ మృతితో వెలుగులోకి దారుణాలు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలోని తుంగతుర్తిలో నకిలీ వైద్యుడి చేతిలో ఒక గర్భిణీ మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తెలంగాణ వైద్య మండలి సుమోటోగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా నకిలీ వైద్యుడు శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కేవలం చికిత్స మాత్రమే కాదు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

చికిత్స పేరుతో ప్రాణం తీశాడు…
తుంగతుర్తిలో నకిలీ వైద్యుడు/ఆర్ఎంపీ శ్రీనివాస్ చేసిన చికిత్స వికటించి 26 ఏళ్ల గర్భిణీ మృతి చెందడంతో ఈ ఘటనపై తెలంగాణ వైద్య మండలి స్పందించింది. ఆదివారం విచారణ బృందం అధికారి డాక్టర్ గుండగాని శ్రీనివాస్, డాక్టర్ విష్ణుతో కూడిన బృందం తుంగతుర్తికి చేరుకుంది. నకిలీ వైద్యుడు శ్రీనివాస్ నిర్వహిస్తున్న సాయి బాలాజీ ఆసుపత్రిపై విచారణ జరిపింది.

లింగ నిర్ధారణ పరీక్షలు..‌‌. అబార్షన్ల మాఫియా
ఈ విచారణలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ వైద్యుడు శ్రీనివాస్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, శ్రీనివాస్ తనతోటి ఆర్ఎంపీలతో కలిసి ఒక మాఫియాను నడుపుతున్నాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అక్రమంగా గర్భ విచ్ఛిత్తిని ప్రోత్సహించడం వంటివి చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ అక్రమ దందాలో ఇంకా కొంతమంది ఆర్ఎంపీల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పరారీలో నిందితుడు…
ప్రస్తుతం నిందితుడు ఆర్ఎంపీ శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అబార్షన్ల దందాలో ఎంతమందికి అబార్షన్లు చేశారు, ఈ కుంభకోణంలో ఇంకెంతమందికి పాత్ర ఉంది అనే విషయాలు విచారణలో తేలనున్నాయని డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. నకిలీ వైద్యుడి ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు.

గతంలోనూ ఫిర్యాదులు…
గతంలోనూ ఇదే అక్రమ దందాపై స్థానికులు జిల్లా వైద్య అధికారికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్‌కి తెలియజేశారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఒక నిండు గర్భిణీ ప్రాణం పోయి ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రస్తుత సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌ను ఫోన్‌లో సంప్రదించగా… గత ఫిర్యాదులు తన దృష్టికి రాలేదని, తాను ఇటీవల ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. ఇటువంటి అక్రమ గర్భ విచ్ఛిత్తి, ఇంజెక్షన్లు, ఆపరేషన్లు చేసే ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నకిలీ వైద్యుడు శ్రీనివాస్‌పై భారతీయ వైద్య మండలి చట్టం ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *