- 1300 కిలోమీటర్ల మేర ప్రజలతో పాదయాత్ర
- ఓటు హక్కుపై దాడిని ఎండగట్టడమే లక్ష్యం
- ఢిల్లీలో వార్-1… క్షేత్రస్థాయిలో వార్-2
- ఒకటో తేదీన పాట్నా సభతో యాత్ర ముగింపు
సహనం వందే, పాట్నా:
రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఎన్నికల కమిషన్ కు చుక్కలు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాలో నెలకొన్న తప్పులను ఎండగడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను పరిరక్షించేందుకు ఆయన యుద్ధమే చేస్తున్నారు. వార్-1లో ఢిల్లీ కేంద్రంగా తన ప్రతాపం చూపగా… వార్-2లో క్షేత్రస్థాయిలో బీహార్ కేంద్రంగా యుద్ధం ప్రకటించారు. ఆదివారం నుంచి ఆ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు 1300 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ సభతో ముగియనుంది. ఓటరు జాబితా సమీక్ష పేరుతో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

ఓటు హక్కుపై దాడి.. ప్రజాస్వామ్యానికి చేటు
బీహార్‌లో ఓటరు జాబితా సమీక్ష (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో కొందరు అధికారులు, రాజకీయ శక్తులు ప్రజల ఓటు హక్కును అడ్డగిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, వారిలో అవగాహన కల్పించడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ఓటు హక్కు కోసం పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
ప్రజలతో రాహుల్ గాంధీ మమేకం…
ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బీహార్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. ఓటరు జాబితా సమీక్షలో జరుగుతున్న అవకతవకలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర ప్రజల గొంతును బలంగా వినిపించేందుకు, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. ప్రజాస్వామ్య రక్షణలో ఈ యాత్ర ఒక ముందడుగుగా నిలుస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. రాహుల్ నాయకత్వంలో ఈ యాత్ర ప్రజల మనసులను గెలుచుకుంటుందని పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.

రాజకీయ కోణంలో యాత్ర…
ఈ యాత్ర కేవలం ఓటరు జాబితా సమస్యలకు మాత్రమే పరిమితం కాదని, బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలోపేతం కావడానికి కూడా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రజలతో నేరుగా సంభాషించడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, రాబోయే ఎన్నికల్లో ఈ యాత్ర ప్రభావం చూపుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా బీహార్ ప్రజలకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీనియర్ నాయకుడు తెలిపారు.
రాహుల్ తో అడుగులు వేయనున్న రేవంత్…
బీహార్ లో రాహుల్ గాంధీ యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలో ఉన్న కీలక నాయకులంతా ఆయనతో అడుగులు వేసే అవకాశం ఉంది. తద్వారా ఓట్ల చోరీ వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టే స్కెచ్ ఆ పార్టీ రూపొందించింది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కూడా రాహుల్ తో అడుగులు వేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో కలిసి బీహారులో పాదయాత్రలో ఒకటి రెండు రోజులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.