- ముఖ్యమంత్రిపై రాజగోపాల్‌రెడ్డి దండయాత్ర
- ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులా?
- అలాంటప్పుడు నల్గొండకి ఇస్తే తప్పేంటి?
- ప్రభుత్వాన్ని ఉతికిపారేస్తున్న మునుగోడు నేత
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్‌లో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీని విస్మరించడం, నియోజకవర్గానికి నిధులు రాకపోవడంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనతో మాట్లాడాలని నిర్ణయించినప్పటికీ, రాజగోపాల్‌రెడ్డి తన దండయాత్రను ఆపడం లేదు.
మంత్రి పదవి వివాదం.. విభేదాలకు కారణం
రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దానిని అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. తనను మంత్రిగా చూడాలని మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారని, తనకు మంత్రి పదవి వస్తే నియోజకవర్గానికి మరింత న్యాయం జరుగుతుందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి ఒక సభలో ‘తానే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా’అని చెప్పడాన్ని, అలాగే మీడియాపై చేసిన వ్యాఖ్యలను కూడా రాజగోపాల్‌రెడ్డి తప్పుబట్టారు. తాను, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్థులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, నల్గొండ జిల్లాకు ఎందుకు ఇవ్వరని నిలదీస్తున్నారు.
మునుగోడు అభివృద్ధికి సహకరించట్లేదంటూ…
పదవులే కాదు… పైసలు కూడా మీకేనా అంటూ రాజగోపాల్‌రెడ్డి తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని ఆయన ఆరోపించారు. ఈ సమస్యపై మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదని ఆయన హెచ్చరించారు. ‘రేవంత్ మనకు పదవులు ఇస్తలేడు.. మన కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేడు’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజల కోసమే తాను రేవంత్‌రెడ్డితో కొట్లాడుతున్నానని, తనకు మంత్రి పదవి ఎలా రావాలో అలా వస్తుందని, ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.