- వానలు పడుతున్నా అందుబాటులో లేదు
- యూరియా కొరతతో రాష్ట్రవ్యాప్తంగా క్యూలు
- ఆదుకోవాలని కేంద్రానికి తుమ్మల విజ్ఞప్తి
- కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్
సహనం వందే, హైదరాబాద్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ గొడవలతో తెలంగాణ రైతాంగం నలిగిపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోర నిర్లక్ష్యం చూపుతోందని, రైతుల బతుకులతో ఆడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగితాల మీద కేటాయింపులు చేసినట్లు చూపించి, నిజానికి సరఫరాలో లోటు తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
కాగితాలపైనే కేటాయింపులు…
తెలంగాణకు ఈ ఖరీఫ్ సీజన్‌లో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ ఏప్రిల్ నుంచి జూలై వరకు 32 శాతం లోటు ఏర్పడింది. మే నెలలో ఈ కొరత 45 శాతానికి చేరగా, ఆగస్టులోనూ 35 శాతం లోటు కొనసాగుతోంది. రాష్ట్రం ముందస్తుగా తమ అవసరాలను తెలియజేసినా, కేంద్రం నుంచి స్పందన లేక రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడే దుస్థితి ఏర్పడింది. ఆగస్టు నెలలో 3 లక్షల టన్నులు కావాలని రాష్ట్రం స్పష్టం చేసినా, కేంద్రం మాత్రం ఖాళీ హామీలతో రైతులను మభ్యపెడుతోంది. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
దిగుమతి యూరియాతో దొంగాట…
రాష్ట్రం దేశీయ యూరియా సరఫరా చేయాలని పదేపదే కోరినా కేంద్రం 39,000 మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియాను కేటాయించింది. అయితే ఈ యూరియాను తీసుకురావడానికి నౌకలు కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులకు ఎరువులు అందక వారి పంటలు దెబ్బతింటున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు 2.10 లక్షల టన్నుల లోటుతో పాటు, ఆగస్టులో 57,000 టన్నుల కొరత ఏర్పడింది. ఈ లోటును వెంటనే భర్తీ చేయాలని రాష్ట్రం డిమాండ్ చేస్తున్నా, కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు.
రాజకీయ హడావుడిలో రైతన్న గోస…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ గొడవలు రైతులను బలి చేస్తున్నాయి. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కూడా రైతుల సమస్యలపై నోరు మెదపక, రాజకీయ ప్రకటనలతో సమయం వృథా చేస్తున్నారని తుమ్మల మండిపడుతున్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర ఎంపీలు యూరియా సరఫరా కోసం విన్నవించినా, కేంద్రం నుంచి ఖాళీ హామీలు తప్ప ఫలితం లేదు. రైతులు పొలంలో పని చేయాల్సిన సమయంలో ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని తుమ్మల ఆరోపించారు.
ముఖ్యమంత్రి విన్నవించినా స్పందన కరువు…
తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు. కానీ వారి పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం ఎన్ని లేఖలు రాసినా, అధికారులు ఎన్నిసార్లు కలిసినా, స్వయంగా ముఖ్యమంత్రి విన్నవించినా కేంద్రం కన్నెత్తి చూడడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే, రైతాంగం ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
రైతు హక్కుల కోసం పోరాటం…
తెలంగాణ రైతుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ పోరాడుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్రం నిర్లక్ష్య ధోరణి మారకపోతే, రైతుల సమస్యలను లేవనెత్తి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. రైతన్న బతుకు బాగుపడాలంటే కేంద్రం వెంటనే యూరియా సరఫరా చేసి లోటును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.