- దేశాన్ని ఊపేస్తున్న ఓట్ల దొంగతనం రగడ
- రాహుల్ ఉద్యమానికి అన్ని వర్గాల మద్దతు
- వివిధ రాష్ట్రాల్లోనూ దొంగ ఓట్లపై చర్చ
- తమ ఓటమికి దొంగ ఓట్లే కారణమని ప్రచారం
సహనం వందే, హైదరాబాద్:
తమిళనాడు విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసే ఉంటారు. అందులో తన ఓటును మరొకరు వేయడంపై పెద్ద పోరాటమే చేస్తారు. తన ఓటు తనకు కల్పించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం కాస్త అన్ని నియోజకవర్గాలకి పాకి చివరకు లక్షలాదిమంది తమ ఓటు ఎవరో వేశారని ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయాల్సిన కొత్త ప్రభుత్వం కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోతుంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకరకంగా అటువంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో కనిపిస్తుంది. దేశంలో ఓట్ల దొంగతనంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఎన్నికల్లో అధికార బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విపక్షాలు ఏకంగా లోక్‌సభను రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

తృణమూల్ నేత అభిషేక్ సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈ వివాదానికి కొత్త ఊపు తీసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో భారీ తప్పిదాలు ఉన్నాయని, ఇవన్నీ బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరిస్తున్నాయని అన్నారు. ‘ఒకే ఎపిక్ నంబర్‌కు చాలా మంది ఓటర్లు ఉన్నారు. ఈ సమాచారం ఈసీ దగ్గరే ఉంది. దీనికి బీజేపీ ఎందుకు మద్దతిస్తోందో సమాధానం చెప్పాల’ని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవకతవకలు కేవలం బెంగాల్ లేదా బిహార్‌లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అని ఆయన పేర్కొన్నారు.
అందుకే లోక్‌సభను రద్దు చేసి, అందరూ తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఆయన సవాలు విసిరారు. గతంలో ఉన్న ఈసీ కమిషనర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఓటు చోరీ ఉద్యమం…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఓట్ల దొంగతనం అంశంపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఓటు చోరీ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఈ అంశానికి మరింత ప్రాచుర్యం కల్పించారు. బీహార్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సుప్రీంకోర్టు కూడా ఈసీని మందలించడం ఈ అంశానికి బలం చేకూర్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో నకిలీ ఓట్ల నమోదు వంటి అంశాలను రాహుల్ ఆధారాలతో సహా బయటపెట్టారు.
ప్రియాంక గాంధీ వినూత్న నిరసన…
ఈ ఆరోపణలపై దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. ఇండియా కూటమిలోని 25 పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి నేతలను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగాన్ని కాపాడే యుద్ధమని అన్నారు. బీహార్‌కు చెందిన మింటా దేవి అనే ఓటరు వయసు 124 ఏళ్లని తప్పుగా చూపించడాన్ని విపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ పార్లమెంటులో నిరసన కూడా చేపట్టారు. ప్రియాంక గాంధీ అందుకు సంబంధించిన ప్రత్యేక టీషర్టులను ధరించి నిరసన తెలిపారు.
దేశవ్యాప్తంగా మద్దతు…
ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, విపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ అంశం మరింత వేడెక్కుతోంది. గల్లంతైన ఓటర్ల జాబితాలను ప్రచురించాలనే నిబంధన లేదని ఈసీ వాదించడం, ఓట్ల తొలగింపు జరిగినా ఓటరుకు ఎలాంటి హక్కులు ఉండవని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ ముఖ్యమని, ఇలాంటి అక్రమాలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని విపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు, అభ్యర్థులు కూడా తమ ఓటమికి దొంగ ఓట్లు కారణమని పెద్ద రచ్చ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాటిపై ఉద్యమమే నడుస్తుంది. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.