- సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ రెమ్యూనరేషన్
- విడుదల రోజున సెలవు ప్రకటించిన సంస్థలు
- రిలీజుకు ముందే రూ. 250 కోట్ల వ్యాపారం
- కూలీ సునామీ… రికార్డులు బద్దలు
సహనం వందే, హైదరాబాద్:
సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి.
ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలు
సాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ సినిమా కోసం రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నారట. ఈ భారీ బడ్జెట్ (రూ.375 కోట్లు) సినిమాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారు. అంటే బడ్జెట్‌లో సగానికి పైగా హీరో, దర్శకుడికే పోయింది. విలన్ పాత్ర పోషించిన నాగార్జునకు రూ.30 కోట్ల వరకు పారితోషికం దక్కినట్లు తెలుస్తోంది. ఆసక్తికరంగా రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో అమీర్ ఖాన్ ఈ సినిమాలో ఉచితంగా నటించారట.
సెలవులు ప్రకటించిన సంస్థలు…
కూలీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. అయితే చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ సిబ్బందికి ఆ రోజు సెలవు ప్రకటించాయి. ‘యూనో ఆక్వా కేర్’ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ తమ ఉద్యోగుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. రజనీకాంత్ సినిమాలోకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో మిఠాయిలు పంచే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం జనం థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. కేరళలోనైతే పరిస్థితి మరింత ఉధృతంగా ఉంది. థియేటర్ల దగ్గర అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం జనం ఎగబడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
విడుదలకు ముందే భారీ వ్యాపారం
ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో వ్యాపారం చేసింది. రూ. 375 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో దాదాపు రూ. 250 కోట్లు సంపాదించింది. అంటే బడ్జెట్‌లో 66% విడుదల కాకముందే రికవరీ అయ్యింది. అంతర్జాతీయ హక్కులు, డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ హక్కుల ద్వారా ఈ మొత్తం వచ్చింది. ఒక్క అంతర్జాతీయ హక్కులు మాత్రమే రూ. 60 కోట్లకు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ కూలీ సంచలనం సృష్టిస్తోంది.
విదేశాలలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మిలియన్ డాలర్ల మార్కును దాటేశాయి. కేరళ, తమిళనాడులలో మాత్రమే దాదాపు రూ. 40 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఆంధ్రా, తెలంగాణలో ఇంకా బుకింగ్స్ మొదలు కాకముందే ఈ రేంజ్‌లో వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏడు పదుల వయసులోనూ రజనీకాంత్ సృష్టిస్తున్న ఈ సునామీకి అందరూ నోరెళ్ళబెడుతున్నారు.