ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

  • 42 శాతం అమలు బాధ్యత ఎమ్మెల్యేలపైనే
  • కేంద్రం ఆమోదిస్తుందన్న ఆశలకు గండి
  • దీంతో పార్టీగా అమలు చేయాలని నిర్ణయం
  • త్వరలో మండల స్థాయి నుండి సమావేశాలు

సహనం వందే, హైదరాబాద్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యే లు లేదా నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీలే 42 శాతం మంది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత కల్పించే అవకాశం ఉంది.

రాష్ట్రపతి వద్ద పెండింగ్…
కులగణన ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతోపాటు రాజకీయాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. వాటిని పరిశీలించిన గవర్నర్… రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టారు. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇండియా కూటమిలోని ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది.

ఢిల్లీలో ధర్నా చేసిన మరునాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన కీలకమైన మంత్రులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రత్యామ్నాయాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని… అలాగే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు.

పార్టీపరంగా ముందుకు ఎలా వెళ్లాలి?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ఏ రకంగానైనా ఆ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల పార్టీకి మరింత ప్రయోజనం జరుగుతుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు (27 శాతం) కల్పించాలని… మిగతా వాటిని (42 శాతం వరకు) పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా, ఇటు రాజకీయపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అసెంబ్లీలో అంగీకరించిన అన్ని పార్టీలు కూడా 42 శాతం రిజర్వేషన్లను వారి పార్టీ పరంగా అమలు చేయాలని… ఆ మేరకు అన్ని పార్టీలకు పిలుపు ఇవ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు.

అయితే రాజ్యాంగపరంగా లేని రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేయాలని మిగిలిన పార్టీలను కోరలేమని సీఎం అన్నట్లు తెలిసింది. మిగతా పార్టీల సంగతి పక్కనపెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకు సంబంధించి త్వరలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కీలకమైనటువంటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లు అమలు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ నాయకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందోనన్న చర్చ జరుగుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *