నర్సింగ్ ఉద్యోగాల్లో లింగ వివక్ష – పురుష నర్సులకు ప్రమోషన్లు కరువు!

సహనం వందే, హైదరాబాద్:
నర్సింగ్ వృత్తిలో మహిళలకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే అపోహను దాటి, ఇప్పుడు పురుషులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారు. అయితే తెలంగాణలో పురుష నర్సులకు ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఎదురవుతోంది. సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్నప్పటికీ పాత జీవోల కారణంగా వారికి పదోన్నతులు రావడం లేదు. పాత నిబంధనలను సవరించాలని తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది.

ఎదురవుతున్న వివక్ష…
2005లో పురుష విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా జీవో 82ను జారీ చేశారు. దీనివల్ల 2011 నుంచి ఇప్పటివరకు దాదాపు 1200 మంది పురుష నర్సింగ్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. అయితే ప్రమోషన్ల విషయంలో మాత్రం వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పాత జీవోలు స్టాఫ్ నర్స్ పోస్టులకు, ప్రమోషన్లకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని నిర్దేశించాయి. దీనివల్ల 2024లో విడుదలైన లెక్చరర్ ప్రమోషన్ సీనియారిటీ జాబితాలో ఒక్క పురుష నర్సు పేరు కూడా లేకపోవడం వారిలో తీవ్ర నిరాశను కలిగించింది.

కోర్టు తీర్పు కూడా అనుకూలమే…
పురుష నర్సులకు జరుగుతున్న అన్యాయంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (హైదరాబాద్) విచారణ జరిపి స్టాఫ్ నర్స్ పోస్టులను మహిళలకు మాత్రమే పరిమితం చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ రూల్స్‌ని సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందని కూడా కోర్టు పేర్కొంది. అయినా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిష్కారం…
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ సమస్యను చాలా త్వరగా పరిష్కరించింది. ఈ ఏడాది మార్చి 14న జీవో నంబర్ 47ను జారీ చేసి, నర్సింగ్ సర్వీస్ రూల్స్‌లో కీలక సవరణలు చేసింది. ‘కేవలం మహిళలు’ అనే పదాలను ‘పురుషులు, మహిళలు’గా మార్చింది. ఈ సవరణల ద్వారా పురుష నర్సులకు కూడా సమాన అవకాశాలు కల్పించి, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమస్య పరిష్కారం అయినప్పుడు, తెలంగాణలో ఎందుకు జరగడం లేదని పురుష నర్సులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వానికి కమిటీ విజ్ఞప్తి…
తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఒకప్పుడు పురుషులకు ఈ రంగంలో అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పాత జీవోలను సవరించి లింగ వివక్షను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని, పురుష నర్సులకు కూడా సమాన ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది. నర్సింగ్ వృత్తిలో లింగ వివక్షకు తావు ఉండకూడదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *