- హైదరాబాద్ సహా పలుచోట్ల ప్రయోగాలు
- ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ట్రయల్స్
- ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి
- ‘డెంగీఆల్’ అనే డెంగీ వ్యాక్సిన్ కు శ్రీకారం
సహనం వందే, హైదరాబాద్:
డెంగీ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వాలంటీర్లతో కూడిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ‘డెంగీఆల్’ అనే సింగిల్-డోస్ డెంగీ వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితత్వం, రోగనిరోధకతను పరిశీలించడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 20 సెంటర్లలో ట్రయల్స్…
ఈ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 20 వేర్వేరు కేంద్రాలలో జరుగుతున్నాయి. ఇందులో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖ వైద్య సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. కర్ణాటకలోని మైసూరులో ఉన్న జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, బెంగళూరులోని బెంగళూరు మెడికల్ కాలేజ్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఈ ట్రయల్స్‌లో క్రియాశీలకంగా పాల్గొంటున్నాయి.

ఒక్కో కేంద్రానికి రూ. 1.5 కోట్లకు పైగా బడ్జెట్…
ఈ ప్రతిష్టాత్మక అధ్యయనం కోసం ఐసీఎంఆర్ భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఒక్కో పరిశోధనా కేంద్రానికి సుమారు రూ. 1.3 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిధులతో పరిశోధనలు వేగవంతంగా, అత్యున్నత ప్రమాణాలతో సాగేందుకు వీలు కలుగుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, డెంగీ నివారణలో ఇదొక విప్లవాత్మక అడుగు కాగలదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెంగీ కారణంగా ప్రాణాలను కోల్పోతున్న వేలాది మందికి ఈ వ్యాక్సిన్ కొత్త ఆశలు కల్పించనుంది.