- ఒంటరి యువతులు, బాలికలే లక్ష్యం
- ఒంటరిగా వస్తే జీవించి బయటపడడం కష్టం
- 450 మందిని హత్య చేసినట్లు సమాచారం
- శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు
- క్షుద్రపూజలు.. వెలుగులోకి భయానక నిజాలు
- ఆధునిక సమాజంలో అత్యంత కిరాతకాలు
సహనం వందే, కర్ణాటక:
కర్ణాటకలోని పవిత్ర శైవక్షేత్రం ధర్మస్థల చుట్టూ భయానక రహస్యాలు కమ్ముకున్నాయి. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన దారుణ హత్యలు, క్షుద్రపూజల పేరుతో నరబలులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు లభ్యమవడం కేసును మరింత ఉద్విగ్నంగా మార్చింది.
ఒంటరి యువతులపై క్షుద్రపూజలు…
ధర్మస్థలం పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను టార్గెట్ చేసి క్షుద్రపూజల పేరుతో నరబలి ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆలయ ప్రాంతంలో ఒంటరిగా వచ్చిన యువతి జీవించి బయటపడే అవకాశం లేదని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ దారుణ హత్యలు కేవలం ఒంటరి యువతులను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు సమాచారం. హత్యల తర్వాత శవాలను నేత్రావతి నది ఒడ్డున లేదా అటవీ ప్రాంతంలో రహస్యంగా పూడ్చిపెట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘోరాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఫలితంగా ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు.
మాజీ కార్మికుడి లేఖతో వెలుగులోకి దారుణం
ఈ భయంకర నిజాలను వెలుగులోకి తెచ్చింది ధర్మస్థలంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి. జిల్లా ఎస్పీకి రాసిన లేఖలో తాను వందలాది మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టానని, వాటిలో మహిళలు, యువతులు, బాలికలు ఉన్నారని ఆరోపించాడు. ఈ శవాలు లైంగిక వేధింపులకు గురై, గొంతు నులిమి హత్య చేసినవి అని అతడు అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని శవాలను డీజిల్‌తో కాల్చినట్లు కూడా ఆయన పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు జూలై 3, 2025న నమోదైంది. కర్ణాటక ప్రభుత్వం వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
అనుమానాస్పద మరణాలతో మిస్టరీ…
ధర్మస్థల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, గతంలో జరిగిన అనుమానాస్పద మరణాలు మరింత దృష్టిని ఆకర్షించాయి. 2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని కాలేజీ ట్రిప్‌లో ధర్మస్థలంలో అదృశ్యమైంది. ఆమె తల్లి సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. అలాగే 2014లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక వ్యక్తిని నిందితుడిగా చేసి, అసలు దోషులను తప్పించినట్లు విమర్శలు వచ్చాయి. 1995 నుంచి 2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు…
సిట్ దర్యాప్తు వేగవంతం చేసి నేత్రావతి నది ఒడ్డున, అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు, చీరలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఒకచోట 13 ఏళ్ల బాలిక అస్థిపంజరం, దానితో పాటు చీర ఆధారాలు కేసుకు కొత్త మలుపు తెచ్చాయి. ఈ అవశేషాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఈ ఆధారాలు ఆరోపణలకు బలం చేకూర్చాయి. 15 స్థలాలను గుర్తించిన సిట్, యాంటీ-నక్సల్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్) సాయంతో తవ్వకాలను కొనసాగిస్తోంది.
రికార్డుల మాయం... పోలీసుల నిర్లక్ష్యం
ఈ కేసులో మరో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే 2000 నుంచి 2015 మధ్య నమోదైన అసహజ మరణాల రికార్డులు బెల్తంగడి పోలీసు స్టేషన్‌లో లేవని తేలింది. ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ రికార్డులు ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిజిటలైజేషన్ అధికంగా ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలో ఈ రికార్డులు డిజిటలైజ్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్లక్ష్యంపై న్యాయ నిపుణులు, పౌర సమాజ సంస్థలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆలయ యాజమాన్యంపై ఆరోపణలు…
ఈ హత్యల వెనుక ఆలయ యాజమాన్యంలో పెద్దల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ధర్మస్థల ధర్మాధికారి రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర హెగ్గడేపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేరాలను కప్పిపుచ్చేందుకు రాజకీయ నాయకులు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో మీడియా కవరేజీపై బెంగళూరు సివిల్ కోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ప్రజల తెలుసుకునే హక్కును అడ్డుకోలేమని పేర్కొంది.
దర్యాప్తు కొనసాగింపు…
ఈ ఘటనలతో ధర్మస్థలం చుట్టూ మిస్టరీ మరింత బలపడింది. స్థానికులు భయంతో ఈ విషయాలను బహిర్గతం చేయడానికి వెనుకాడుతున్నారు. ఓ స్థానికుడు మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి ఈ నేరాల గురించి వింటున్నానని, 24 గంటలు చెప్పినా వాటి వివరాలు అయిపోవని అన్నాడు. కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసి, దర్యాప్తును వేగవంతం చేసింది. మరిన్ని అవశేషాల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ కేసు సమాజంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. నిజాలు పూర్తిగా బయటపడే వరకు దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.