- కరెంటు పోవడంతో నిలిచిపోయిన బంధం
- వారిద్దరి ప్రేమాయణానికి కరెంటు శకునం
- ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న రజినీకాంత్
- శ్రీదేవి కూడా రజినీతో అదే ప్రేమాభిమానాలు
సహనం వందే, హైదరాబాద్:
దశాబ్దాల సినీ ప్రయాణంలో రజినీకాంత్, శ్రీదేవి కలిసి 15 కి పైగా చిత్రాలలో నటించారు. మూండ్రు ముడిచ్చు నుంచి చాల్‌బాజ్ వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ జోడీ, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడ్డారని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఏనాడూ బయటపెట్టలేదు. శ్రీదేవి మరణం తర్వాత ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
కరెంటు పోయిందని వెనక్కు వచ్చేశాడు…
శ్రీదేవిపై రజినీకాంత్‌కు చాలాకాలంగా అభిమానం ఉంది. ఒకానొక సందర్భంలో శ్రీదేవి ఇంట్లో జరిగిన గృహప్రవేశం పార్టీకి వెళ్లిన రజినీకాంత్… తన మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే ఊహించని విధంగా పార్టీ జరుగుతున్న సమయంలో ఇంట్లో కరెంటు పోయింది. దాంతో దీన్ని చెడు శకునంగా భావించిన రజినీకాంత్… శ్రీదేవితో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆ తర్వాత శ్రీదేవితో ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదని కూడా అంటున్నారు.
అప్పుడు శ్రీదేవికి 13 ఏళ్ళు…
తమిళ సినీ ప్రపంచంలో రజినీకాంత్, శ్రీదేవిల ప్రయాణం 1976లో మూండ్రు ముడిచ్చు సినిమాతో మొదలైంది. ఈ చిత్రంలో శ్రీదేవికి అప్పటికి కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. శ్రీదేవికి ఇది మొదటి సినిమా కాగా… రజినీకాంత్‌కి తొలిసారి లీడ్ రోల్ లభించింది. కాలక్రమేణా వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఒకరి పట్ల ఒకరు మరింత గౌరవాన్ని పెంచుకున్నారు. శ్రీదేవి కుటుంబానికి కూడా రజినీకాంత్ దగ్గరయ్యారు.

తెరమరుగైన ప్రేమ…
శ్రీదేవి, రజినీకాంత్‌ల మధ్య ఒకానొక సమయంలో బలమైన ప్రేమ బంధం ఉంది. 1996లో శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా రజినీకాంత్, శ్రీదేవికి దూరంగా ఉండలేదు. శ్రీదేవికి ఏదైనా సమస్య వస్తే రజినీకాంత్ వెంటనే స్పందించేవారు. శ్రీదేవి మరణం తర్వాత కూడా రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి కూడా రజినీకాంత్ పట్ల చాలా ప్రేమగా ఉండేవారని చెబుతున్నారు. ఒకానొక సందర్భంలో రజినీకాంత్ రాణా సినిమా షూటింగ్‌లో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్రీదేవి ఆయన క్షేమం కోసం ఏడు రోజులు ఉపవాస దీక్ష కూడా చేశారని అంటుంటారు.
ప్రేమ విఫలమై వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు…
శ్రీదేవి , బోనీ కపూర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినిమా ప్రపంచంలోకి ప్రవేశించగా, చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా ఇటీవల నటిగా మారారు. శ్రీదేవి 2018లో ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఒక హోటల్‌లో అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె మరణం దేశవ్యాప్తంగా ప్రజలను, అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఇక రజినీకాంత్ 1981లో లతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్, చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ సినీ పరిశ్రమలోనే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.