దిక్కులేని దీనులు… ‘మహా’ విద్యార్థులు – మహావీర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఘోరం

  • వార్డుల్లో రోగులు లేకుండానే వైద్య బోధన
  • ఖాళీ మంచాలతో దర్శనమిస్తున్న వార్డులు
  • చదువు చెప్తారా? సర్టిఫికెట్లిచ్చి పంపుతారా?
  • విద్యార్థులకు ద్రోహం చేస్తున్న యాజమాన్యం
  • ఇక్కడ చదువుకొని వైద్యం ఎలా చేయాలి?
  • ఎన్ఎంసీ అక్రమాలకు పరాకాష్ట ఈ కాలేజ్
  • డబ్బా కాలేజీకి అనుమతులెలా వచ్చాయి?
  • ప్రతిరోజూ నకిలీ రోగులను తెస్తున్నారు
  • ‘సహనం వందే’ మెడికల్ కాలేజీ సందర్శన

వికారాబాద్ నుంచి ‘సహనం వందే’ ప్రతినిధి:
వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని పరిశీలిస్తే దీనికి ఇన్నాళ్లు ఎలా అనుమతులు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కళ్ళు మూసుకుని ముడుపులు పుచ్చుకొని బాజాప్తా అనుమతులు ఇచ్చినట్లు అర్థం

అవుతుంది. ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి… లేదా ఈ ఆర్టికల్ తోపాటు పెడుతున్న వీడియోలను చూడండి. దానికి అనుమతులు ఇవ్వడం న్యాయమా లేదా మీరే నిర్ణయించండి. (ఈ ఆర్టికల్ తో పాటు నేను పెడుతున్న ఒపీనియన్ పోల్ లో ఆన్ లైన్ ఓటు వేయండి)

బూత్ బంగ్లాగా బోధనాసుపత్రి…
సోమవారం అంటే సహజంగా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతాయి. మరీ ప్రత్యేకంగా ప్రస్తుత వానాకాలం సీజన్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మహావీర్ మెడికల్ కాలేజీ బోధనాసుపత్రికి వెళితే అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాలేజీని ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ బృందం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అణువణువూ పరిశీలించింది.

కాలేజీ అంటే ఇలా కూడా ఉంటుందా? ఇలాంటి డబ్బా కాలేజీలకు కూడా డబ్బులు పెడితే అనుమతులు వస్తాయా? అన్న అనుమానాలు వచ్చాయి. వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందించాల్సిన ఈ మెడికల్ కాలేజీ… కనీస వసతులు లేకుండా ఉంది. నిబంధనల మేరకు ఉండాల్సిన రోగుల ఆక్యుపెన్సీ ఏమాత్రం లేదు. ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులతో హడావుడిగా ఉండాల్సిన బోధనాసుపత్రి… ఒక పాడుపడిన భవనంలా దర్శనం ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. అత్యంత బిజీగా ఉండాల్సిన కొన్ని వార్డులు ఖాళీ మంచాలతో దర్శనం ఇస్తున్నాయి. జనరల్ మెడిసిన్ వార్డును చూస్తే చీకటి గుహ లెక్క ఉంది. వార్డును, మంచాలను శుభ్రం చేయక ఎన్నాళ్లయిందో అర్థం కావడం లేదు. ఇక పీడియాట్రిక్ వార్డు చూస్తే అదే పరిస్థితి. జనరల్ సర్జరీ వార్డులో ఎవరూ లేరు.

గైనకాలజీ వార్డుకు వెళ్తే అక్కడ కొందరు మహిళలు కనిపించారు. వాళ్లు వైద్యానికి వచ్చినట్లు లేదు… డబ్బులు ఇచ్చి అమాయక ప్రజలను తీసుకువచ్చారని అక్కడి వాళ్లు తెలిపారు. మేము వెళ్లి చూడగా అక్కడ అందరూ గుమికూడి ముచ్చట్లు వేసుకుంటున్నారు. నర్సులు కానీ, డాక్టర్లు కానీ వార్డుల్లో తిరుగుతున్నట్టు కనిపించలేదు. రోగులే లేనప్పుడు వారెందుకు వస్తారు.

ఎమర్జెన్సీ ఐసీయూ అంటారా దీన్ని?
బోధనాసుపత్రికి అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ వార్డు ఖాళీగా ఉంది. ఒకరిద్దరు రోగులు ఉన్నప్పటికీ వాళ్లకు వైద్యం చేస్తున్నట్టు లేదు. ఇద్దరు ముగ్గురు జూనియర్ డాక్టర్లు ముచ్చటేసుకుంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… దానికి అనుబంధంగా ఉన్న ఐసీయూని చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. దీన్ని ఐసీయూ అని కూడా అంటారా? అని సందేహం వస్తుంది. కొన్ని ఆపరిశుభ్రమైన బెడ్స్… పనిచేయని మానిటర్ అక్కడ కనిపించాయి. విచిత్రం ఏంటంటే ఖాళీగా ఉండటం ఒక ఎత్తు అయితే… ఐసీయూతో సహా ఏ వార్డు కూడా పరిశుభ్రంగా లేకపోవడం పరాకాష్ట.

ఇక అనేక స్పెషాలిటీల అధిపతుల గదులకు తాళాలు వేసి ఉన్నాయి. అంతేకాదు వార్డుల్లో ట్రీట్మెంట్ రూమ్ చెత్తాచెదారంతో ఎలాంటి పరికరాలు లేకుండా కనిపిస్తుంది. అసలు ఏ వార్డు తిరిగినా… ఎక్కడ పరిశీలించినా బీపీ మిషన్ వంటి పరికరాలు కూడా కనిపించలేదంటే ఆశ్చర్యమే మరి. అక్కడ ఒక డాక్టర్ తో మాట్లాడగా… బీపీ మిషన్ పక్కన పెట్టండి కనీసం కొన్ని వార్డుల్లో దూది కూడా లేదని వ్యాఖ్యానించడం పరిస్థితికి దర్పణం పడుతుంది.

ఎన్ఎంసీ తనిఖీల కోసం నకిలీ రోగులు…
మా బృందం తిరిగి బయటకు వస్తుండగా నకిలీ రోగులను తిరిగి బస్సుల్లో పంపిస్తున్న దృశ్యం కనిపించింది. బస్సు మొత్తం నిండినా కిక్కిరిసి పంపిస్తున్నారు. వాళ్లను ఉదయం తీసుకొచ్చి టిఫిన్ పెట్టి డబ్బులు ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నట్టు అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఎంత ఇస్తున్నారని ప్రశ్నించగా… ఒక్కొక్కరికి డిమాండ్ ను బట్టి 200 రూపాయల నుంచి 500 వరకు ఇస్తామని అన్నారు. ఎందుకిలా తెస్తున్నారని ప్రశ్నించగా… ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకురావడం మామూలేనని ఆయన సమాధానం ఇచ్చారు.

చిన్న పిల్లల వార్డు… ఎంత దయనీయంగా ఉందో చూడండి
ఆప్తమాలజీ ఫిమేల్ వార్డు
రెస్పిరిటరీ ఫిమేల్ వార్డ్ పరిస్థితి

మేం గమనించిన అంశాలు…
సోమవారం ఉదయం 11 గంటల సమయంలో

  • జనరల్ సర్జరీ మేల్ వార్డు ఒక దానికి తాళం వేసి ఉంటే… మరొక వార్డులో ఒకతను సెల్ ఫోన్ చూసుకుంటూ కనిపించారు. అతను పేషెంట్ కాదని అర్థం అయిపోతుంది. పక్కన ఎక్కడ కూడా సెలైన్ ఎక్కించినట్టుగానీ… ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగానే కనిపించలేదు.
  • పీడియాట్రిక్ వార్డులో ఒక్క పిల్లవాడు కూడా లేకపోగా… మంచాలన్నీ ఒకదాని మీద ఒకటి వేశారు. దాన్ని వాడక ఎన్నాళ్ళయిందో మరి.
  • జనరల్ మెడిసిన్ ఫిమేల్ వార్డు అత్యంత దయనీయంగా ఉంది. పాడుబడిన బంగ్లాలా కనిపించింది. ఉదయం 11:30 సమయంలో వీడియో తీస్తే అది అత్యంత చీకటిలో ఉన్నట్లు కనిపించింది. దాన్ని వాడక ఎన్నాళ్ళయిందో మరి.
  • ఆర్థోపెడిక్ మేల్ వార్డుకు తాళం వేసి ఉంది.
  • జనరల్ మెడిసిన్ మేల్ వార్డులో ఒక్క రోగి కూడా లేరు.
  • జనరల్ సర్జరీ ఫిమేల్ వార్డులో ఒక మహిళ కనిపించారు.
  • రెస్పిరిటరీ ఫిమేల్ వార్డులో ఒక్కరూ లేరు.
  • ఆప్తమాలజీ, డెర్మిటాలజీ ఫిమేల్, సైకియాట్రి మేల్ వార్డుల్లో ఒక్క రోగి కూడా లేరు.
  • మెడికల్ కాలేజీలో లైబ్రరీలో పుస్తకాలు, మ్యాగజైన్స్ కనిపించలేదు. కొందరు విద్యార్థులు అక్కడ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *