- గురుకులాల్లో 886 ఫుడ్ పాయిజన్ కేసులు
- నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా?
- జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతారా?
- నెలలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
- హైదరాబాదులో కమిషన్ విచారణలు
సహనం వందే, హైదరాబాద్:
మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా? ఏఐ కాలంలోనూ పేద విద్యార్థులను కాపాడుకునే స్థితిలో కూడా లేమా? ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అనేకమంది విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 886 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగి 48 మంది బహుజన పేద విద్యార్థులు మరణించారంటే… ఇవి సాధారణ మరణాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో జరిగిన హత్యలుగా భావించాల్సి ఉంటుంది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్…
48 మంది విద్యార్థులు మృతి చెందిన దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంత నిర్లక్ష్యంగా గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయా అని మండిపడింది. పేద విద్యార్థుల జీవితాల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని అధికారులను నిలదీసింది. ఇన్ని కేసులు ఎందుకు నమోదయాయని దునుమాడింది. అంత అపరిశుభ్రంగా పిల్లలకు భోజనం పెడుతున్నారా అని నిలదీసింది. ఈ సందర్భంగా కమిషన్ ఐదు గురుకుల పాఠశాలల కార్యదర్శులను నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల ఓపెన్ హియరింగ్, క్యాంప్ సిట్టింగ్‌లో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన 109 కేసులను విచారించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, సభ్యులు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, విజయ భారతి సయాని అధికారుల సమక్షంలో బాధితులు, ఫిర్యాదుదారులను విచారించారు.
నిర్లక్ష్యానికి పరాకాష్ట…
ఆసుపత్రులలో అగ్నిప్రమాదాల వల్ల పిల్లల మరణాలు, నివాస ప్రాంతాలలో పెరిగిపోతున్న వీధి కుక్కల బెడద, అగ్నిప్రమాదంలో మరణాలు, పులి దాడి కేసులు, గిరిజన మహిళల అక్రమ రవాణా, గిరిజన కుటుంబాలను బలవంతంగా తొలగించడం అంటే అంశాల పైన కూడా కమిషన్ విచారించింది. కనీస మానవ సౌకర్యాల నిరాకరణ, మహిళలపై నేరాలు (అత్యాచారంతో సహా), పిల్లలపై నేరాలు, పోలీసుల దౌర్జన్యాలు, ఆత్మహత్యలు, దళిత బంధు పథకం నిధుల దుర్వినియోగం, కుటుంబ పెన్షన్ కేసులు, ప్రాథమిక పాఠశాలల లేకపోవడం, పోషకాహార లోపం కేసులు, పోలీసులచే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి అనేక కీలక అంశాలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులను కమిషన్ చివాట్లు పెట్టింది. తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనలపై 109 కేసులు విచారణ చేసింది. గిరిజన మహిళల అక్రమ రవాణా కేసులో, తప్పు చేసిన కానిస్టేబుల్‌ను సర్వీస్ నుండి తొలగించారు.