- ఆయిల్ పామ్ తోటల్లో జన్యు లోపాలు
- అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న రైతులు
- ఆయిల్ పామ్ గ్రోవర్స్ ప్రతినిధుల వెల్లడి
సహనం వందే, అశ్వారావుపేట:
ఆయిల్ పామ్ తోటలు తవ్విన కొద్దీ అవినీతి బండారం బయటపడుతుంది. ఇదొక వెబ్ సిరీస్ లాగా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. జన్యు లోపాలున్న మొక్కలతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, ఆయిల్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం, కుమ్మక్కు రాజకీయాలు వారిని మరింత దిగజారుస్తున్నాయి. ఇటీవల ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రతినిధులు, ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఆసన్నగూడెం గ్రామంలో పర్యటించినప్పుడు వెలుగుచూసిన వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రతినిధులు ఒక నివేదిక తయారు చేశారు.
75% మగ గెలలు… దిక్కుతోచని స్థితి
ఆసన్నగూడెం గ్రామానికి చెందిన మురళి అనే రైతుకు చెందిన ఐదేళ్ల ఆయిల్ పామ్ తోటలో ఏకంగా 75% మొక్కలు కేవలం మగ గెలలు మాత్రమే ఉండటం చూసి శాస్త్రవేత్తలు సైతం నివ్వెరపోయారు. ఒకటి రెండు మాత్రమే ఆడ గెలలు రావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మురళి తోటలో మాత్రమే కాదు… గ్రామంలోని అనేక తోటల్లో ఇదే పరిస్థితి ఉందని అక్కడికి వచ్చిన రైతులు శాస్త్రవేత్తలకు వివరించారు. దశాబ్దాలుగా ఆయిల్ పామ్ సాగులో అపార అనుభవం ఉన్న రైతులు నివసించే ఈ ప్రాంతంలో 2016 నుండి నాటిన ప్రతీ తోటలోనూ ఈ సమస్య వెలుగు చూడటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.

నిర్లక్ష్యమా? కుట్రా?
ఈ దుస్థితిపై ఆయిల్ ఫెడ్ అధికారులు, ఆయిల్ పామ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు కనీసం స్పందించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల సాగు అనుభవం ఉన్న ఈ గ్రామంలో నెలకొన్న ఈ సమస్యను అధికారులు ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? దాచిపెట్టి రైతులకు ఎందుకు నష్టం కలిగిస్తున్నారు? అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిజాలు చెప్పి జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని, లేకపోతే ఆయిల్ పామ్ రైతులకు ద్రోహం చేసిన వారిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరిస్తున్నారు. ఆయిల్ పామ్ నర్సరీలో జరిగిన అక్రమాలకు, కల్తీ మొక్కల సరఫరాకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెడతామని ఆయిల్ పామ్ రైతు సంఘం సవాల్ విసిరింది. రైతుల తోటలను పరిశీలించిన తర్వాత ఆఫ్ టైప్, జన్యుపరమైన లోపాలున్న మొక్కలు మూడు రకాలుగా ఉన్నాయని నిర్ధారించింది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, మోసమని తేల్చిచెప్పింది.
రాజశేఖర్ రెడ్డి నిర్వాకాలు…
ఆయిల్ ఫెడ్ అధికారులు 2016-2020 మధ్య రైతులకు ఇచ్చిన మొక్కలు అన్నీ కోస్టారికా నుండి తెప్పించిన స్ప్రింగ్, ఒక బ్యాచ్ లోకల్ వెరైటీ అని మొక్కుబడిగా చెబుతున్నారు. కానీ తోటల్లో ఇతర రకాల మొక్కలు దర్శనమిస్తుండటం వారి మాటల్లో నిజం లేదని నిరూపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన మోసాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయని ఆయిల్ ఫామ్ రైతు నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు.