వైద్య విద్యకు ‘ఎన్ఎంసీ’ చెద – అవినీతి అడ్డా జాతీయ మెడికల్ ‘కమీ’షన్

  • నిప్పులు చెరిగిన మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’
  • సంచలనాత్మక నివేదిక ప్రచురించిన పత్రిక
  • లంచాల బాగోతం… వైద్య వ్యవస్థకు చీడ
  • రహస్యాల లీకేజీ… ఘోస్ట్ ఫ్యాకల్టీ దందా
  • సీబీఐ కేసులతో ఎన్ఎంసీకి అప్రతిష్ట
  • కంటితుడుపు చర్యలకే పరిమితమైన వైనం
  • కొత్త కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్యకు పీడ
  • నాణ్యత లేని వైద్యులు తయారైతే ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్:
భారత వైద్య విద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ బాంబు పేల్చింది! జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వ్యవస్థీకృత అవినీతికి, అసమర్థతకు నిలయంగా మారిందని ఘాటుగా విమర్శించింది. జులై 19న ప్రచురితమైన ఈ సంచలనాత్మక నివేదిక… భారత వైద్య విద్య భవిష్యత్తును, ప్రజల ఆరోగ్య సంరక్షణ నాణ్యతను అంధకారంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది. ఎన్‌ఎంసీ అక్రమాల పుట్ట అని దునుమాడింది.

లంచాల బాగోతం… వ్యవస్థకే చీడ
జూన్ 30న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఏకంగా 34 మంది వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో ఈ అవినీతి కుంభకోణం పతాక స్థాయికి చేరింది. ఇందులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎంసీ అధికారులు, ఛత్తీస్‌గఢ్‌లోని శ్రీ రావత్‌పురా మెడికల్ కాలేజీని తనిఖీ చేసిన కొందరు వైద్యులు సైతం ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో 40 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించగా… అధికారులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కుమ్మక్కై ప్రక్రియను ఎలా తారుమారు చేశాయో కళ్లారా చూశారు. శ్రీ రావత్‌పురా కాలేజీ యాజమాన్యం ఎన్‌ఎంసీ అధికారులు, డాక్టర్లకు రూ. 55 లక్షలు లంచం ఇస్తుండగా సీబీఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కాలేజీకి అనుమతి ఇవ్వడం కోసమే ఎన్‌ఎంసీ అధికారులు ఈ లంచం తీసుకున్నారని తేటతెల్లమైంది. ఇది కేవలం ఒక్క కేసు మాత్రమే కాదు, వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో చెప్పడానికి నిదర్శనమని లాన్సెట్ చెరుగుడులాడింది.

రహస్యాల లీకేజీ… ఎంతటి మోసం?
ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మెడికల్ కాలేజీలకు చెందిన తనిఖీ షెడ్యూల్‌లు, తనిఖీ బృందాల వివరాలు వంటి అత్యంత రహస్య సమాచారాన్ని అనధికారికంగా పొందారు. ఈ సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేశారు. వారు ఆయా మెడికల్ కాలేజీలకు లీక్ చేశారు. ‘ఇలా ముందుగానే సమాచారం లభించడం వల్ల మెడికల్ కాలేజీలు మోసపూరిత ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇందులో అనుకూలమైన తనిఖీ నివేదికలను పొందడానికి లంచాలు ఇవ్వడం, అసలు లేని లేదా నకిలీ అధ్యాపకులను (దీన్నే ఘోస్ట్ ఫ్యాకల్టీ అంటారు) చూపించడం, తనిఖీల సమయంలో కృత్రిమంగా నిబంధనలను పాటించినట్లు చూపించడానికి నకిలీ రోగులను చేర్చడం వంటివి ఉన్నాయి’ అని సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ను ఉటంకిస్తూ లాన్సెట్ నివేదిక తీవ్రంగా మండిపడింది. (తెలంగాణలో వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి ఇలాగే ముందస్తు సమాచారం ఇచ్చినట్లు ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=5051  డిజిటల్ పేపర్ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే).

In the Last Month the management of Mahavir Medical College was prepared after receiving prior information

ఎన్‌ఎంసీ అసమర్థత… బ్యూరోక్రసీ విషకౌగిలి!
ఎన్‌ఎంసీకి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేదని, కేంద్రీకృత అధికారం, బ్యూరోక్రటిక్ అసమర్థతతో పాడైపోయిందని లాన్సెట్ సూటిగా విమర్శించింది. ఈ అవినీతి కుంభకోణాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని ఎన్‌ఎంసీ జులై 14న ప్రకటించింది. కేవలం నలుగురు అసెసర్‌లను బ్లాక్‌లిస్ట్ చేసి, 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు మెడికల్ కాలేజీలకు సీట్లను పునరుద్ధరించవద్దని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇది కేవలం కంటితుడుపు చర్య తప్ప అసలు సమస్యకు పరిష్కారం కాదని లాన్సెట్ విశ్లేషించింది.

కొత్త కాలేజీల ఏర్పాటు తొందరపాటు చర్య…
ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 1,263 మందికి ఒక డాక్టర్ ఉన్నారు, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతి 1,000 మందికి ఒకరిని సిఫార్సు చేస్తోంది. ఈ డాక్టర్ల కొరతను తీర్చడానికి ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో 75,000 కొత్త ఎంబీబీఎస్ సీట్లను లక్ష్యంగా పెట్టుకొని డ్రైవ్ ప్రారంభించిందని నివేదిక పేర్కొంది. అయితే ఇదే అసలు సమస్యకు మూలమని మండిపడింది. ఈ కారణంతో కొత్త మెడికల్ కాలేజీలను తొందరపాటుతో తెరవడానికి, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించడానికి దారితీసింది. ఎన్‌ఎంసీ ఈ విస్తరణకు అనుకూలంగా, కొరతను పరిష్కరించడానికి అధ్యాపకుల నియామకాల నిబంధనలను కూడా సడలించింది. దీర్ఘకాలిక దృష్టి లేదా తగిన సామర్థ్యం లేకుండా ఎంబీబీఎస్, పీజీ సీట్లను వేగంగా విస్తరించాలనే ఉద్దేశంతో ఎన్‌ఎంసీ గతంలో అపఖ్యాతి పాలైన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) వలె పనిచేస్తోందని నివేదిక తీవ్రంగా దుయ్యబట్టింది.

వైద్య విద్య నాణ్యతలో రాజీ…
ఎన్‌ఎంసీ కేవలం వైద్య విద్య సీట్ల సంఖ్యపై దృష్టి సారిస్తే… భవిష్యత్ వైద్యుల నాణ్యతపై ప్రభావం పడుతుందని..‌. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తుందని నివేదిక హెచ్చరించింది. నాణ్యతను బలిపెట్టి సీట్ల సంఖ్య పెంచాలనుకుంటే దేశానికి డాక్టర్లు కాదు, చదువురాని వైద్యులు తయారవుతారని లాన్సెట్ పరోక్షంగా హెచ్చరించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *