‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

  • లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతులకు అన్యాయం
  • ఐదేళ్లయినప్పటికీ పరిహారం ఇవ్వని సర్కార్
  • 120 మంది గిరిజనుల జీవితాలతో ఆటలు
  • దమ్మపేట మండలం జగ్గారం రైతుల గోడు
  • జాతీయ ఎస్టీ కమిషన్ ముందు ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాదులో ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేస్ నాయక్ నిర్వహించిన విచారణలో గిరిజన రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

ఐదేళ్లుగా నిరీక్షణ… నష్టపోయిన రైతులు
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సత్తుపల్లి ట్రంక్ ప్యాకేజ్ నంబరు 12 కింద జగ్గారం గ్రామంలో 122 మంది కోయ, ఇద్దరు ఓసీ రైతులకు చెందిన 103.07 ఎకరాల భూమిని 2020 సెప్టెంబరు 30న అవార్డు పాస్ చేశారు. అయితే ఆ అవార్డు పాసైన ఐదేళ్లు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండానే తమ భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పేరు మీదకు మార్చేయడం వల్ల రైతుబంధు పథకం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అవార్డులో జామాయిల్ తోటలకు నష్టపరిహారం ఇవ్వలేదని, కొందరి తోటల్లో పంటలు ఉన్నా అవార్డులో లేనట్లు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు.

అదనపు పరిహారానికి డిమాండ్…
అవార్డు పాస్ అయినప్పటి నుండి తమ ప్రాంతంలో భూముల ధరలు ఎకరానికి రూ. 15 లక్షల నుండి రూ. 18 లక్షలకు పెరిగాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం తమ ప్రాంతమంతా పామాయిల్ తోటలు వేసి ఎకరానికి లక్షన్నర రూపాయల ఆదాయం పొందుతున్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం ప్రకటించిన రూ. 8 లక్షల పరిహారానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తమకు ఐదేళ్లుగా నష్టపరిహారం చెల్లించనందున ఆ అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలూరుపాడులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది మార్చి 4న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఎకరానికి రూ. 21 లక్షలు అవార్డు పాస్ చేశారని, తమ భూములు జూలూరుపాడు కంటే సారవంతమైనవి కాబట్టి ఎకరానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లిస్తే భూములు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని రైతులు తెలిపారు.

రికార్డుల్లో తప్పులు… అధికారుల నిర్లక్ష్యం
అవార్డు పాస్ చేసి భూముల రికార్డులు మార్చే సమయంలో అనేక తప్పులు చేశారని రైతులు ఆరోపించారు. వాటిని సరిచేయమని ఎస్‌డీసీని కలిస్తే తహసిల్దార్ డ్యూటీ అని… తహసిల్దార్‌కు వినతిపత్రం ఇస్తే ఆర్‌ఐని కలవమంటున్నారని… ఆర్‌ఐని కలిస్తే మళ్లీ సర్వే చేయాలని చెబుతున్నారని రైతులు వాపోయారు. దమ్మపేట తహసిల్దార్ కార్యాలయంలో బ్రోకర్ల ద్వారా డబ్బులిస్తే పనులు త్వరగా అవుతున్నాయని, కానీ తాము డబ్బులివ్వకుండా ముక్కుసూటిగా వెళ్తే ఆరు నెలలైనా సమస్యను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీడర్ కెనాల్స్‌పై అభ్యంతరాలు…
ఇదే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఫీడర్ కెనాల్స్ అంటూ ఇటీవల తమ జగ్గారం గ్రామంలో మరో పీసా గ్రామసభ నిర్వహించారని రైతులు తెలిపారు. కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెట్టడానికి తమ విలువైన పామాయిల్ తోటలను నాశనం చేసే విధంగా ఫీడర్ కెనాల్స్ డిజైన్ చేశారని ఆరోపించారు. దీనివల్ల తమ గ్రామంలో 43 ఎకరాల భూమి పోతుందని, ఈ కెనాల్ నీరు తమ పామాయిల్ పంటకు అసలు ఉపయోగపడదని స్పష్టం చేశారు. తమ దగ్గర వరి సాగు చేసే రైతులు కూడా పెద్దగా లేరని, కేవలం భూగర్భ జలాలను రీచార్జ్ చేయడానికి మూడు చోట్ల మూడు కిలోమీటర్లు ఫీడర్ కెనాల్స్ తవ్వి మూడు చెరువులకు కలిపితే వాటి కింద ఉన్న గొలుసు చెరువులన్నీ నిండుతాయని సూచించారు. ఇంత చిన్న పనికోసం విలువైన తమ పామాయిల్ తోటలను నాశనం చేయడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.

ఎస్టీ కమిషన్ జోక్యం కోరుతూ విజ్ఞప్తి…
తమ సమస్యలపై ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేస్ నాయక్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఐదేళ్లుగా నష్టపరిహారం చెల్లించనందున అవార్డును రద్దు చేయాలని, ప్రస్తుత భూముల ధరల ప్రకారం ఎకరానికి రూ. 25 లక్షలు పరిహారం ఇప్పించాలని, జామాయిల్ తోటలు, చెట్లకు కూడా నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కుర్సం చిన్న రాజు, కల్లూరి రాజేశ్వరరావు, వంక ముత్యాలరావు, వెంకట్రావు, కారం శ్రీరాములు విజ్ఞప్తి చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *