- 7 శాతానికి పైగా ఎగసిన హెరిటేజ్ స్టాక్
- ఇతర స్టాక్స్ నష్టాల్లో ఉన్నా… ఆమెకు లాభం
- కంపెనీ త్రైమాసిక ఆదాయం 1,136 కోట్లు
సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఊహించని లాభం చేకూరింది. శుక్రవారం ఒక్కరోజే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ ధర 7 శాతం పైగా పెరగడంతో ఆమె వ్యక్తిగతంగా రూ. 78.80 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసినప్పటికీ, హెరిటేజ్ స్టాక్ మాత్రం దూసుకుపోవడం విశేషం.
హెరిటేజ్ ఎండీగా భువనేశ్వరి…
నారా భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు కంపెనీలో 24.37 శాతం వాటా ఉంది. అంటే ఆమె పేరున 2,26,11,525 షేర్లు ఉన్నాయి. 1992లో చంద్రబాబునాయుడు ఈ కంపెనీని స్థాపించగా, ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా ఇందులో వాటాదారుగా ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపారం చేస్తోంది. రోజుకు 28.7 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. 418 రకాల డైరీ ఉత్పత్తులను తయారు చేస్తూ, డైరీ రంగంతో పాటు పునరుత్పాదక శక్తి, ఆహార ఉత్పత్తుల రంగాల్లో కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.
త్రైమాసిక ఆదాయం 1,136 కోట్లు…
2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,136.8 కోట్లకు చేరింది. అయితే ఇదే సమయంలో కంపెనీ నికర లాభం మాత్రం 30.7 శాతం తగ్గి రూ. 40.05 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 58.4 కోట్ల లాభం సాధించిన హెరిటేజ్ ఫుడ్స్, ఈసారి లాభాలు తగ్గడానికి డిమాండ్, సరఫరాపై వర్షాల ప్రభావం పడటమే కారణమని తెలిపింది. ఈ త్రైమాసికంలో పాల సేకరణ రోజుకు 17.8 లక్షల లీటర్లకు చేరుకుని 9.9 శాతం వృద్ధిని నమోదు చేయగా, పాల విక్రయాలు 2.8 శాతం వృద్ధి చెందాయి.
మార్కెట్ విలువ… విజన్ 2030 లక్ష్యం
ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ విలువ రూ. 4,560 కోట్ల వద్ద ఉంది. పీఈ నిష్పత్తి 24.24గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.352, గరిష్ఠ ధర రూ. 659గా ఉంది. ప్రస్తుత ధర రూ. 492 వద్ద ట్రేడ్ అవుతూ 38 శాతం వృద్ధిని కనబరుస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ విజన్ 2030 ద్వారా దేశంలో అగ్రశ్రేణి డైరీ న్యూట్రిషన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.