మార్క్’ఫ్రాడ్’… యూరియా ‘బ్లాక్’ – దళారులకు అధికారుల అండ

  • దళారులకు మార్క్ ఫెడ్ అధికారుల అండ
  • కృత్రిమ కొరత సృష్టిస్తూ లక్షల్లో దోపిడి
  • స్టాక్ ను తమ కంట్రోల్ లో ఉంచుకున్న వైనం
  • అయినా చర్యలు తీసుకోవడంలో విఫలం
  • వర్షాలు పడుతుండటంతో భారీ డిమాండ్
  • మరోవైపు రామగుండం కర్మాగారం మూసివేత
  • దీంతో 20 రోజులపాటు యూరియా కొరత

సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వెన్నాడుతుంది. కొరతను నివారించని అధికారులు… కొద్దిపాటి స్టాక్ ను దళారుల చేతుల్లో పెట్టి నల్ల బజారుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, దళారులు ఏకమై బ్లాక్ మార్కెటుకు తరలిస్తున్నారు.

ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, దళారులు ఏకమై బ్లాక్ మార్కెటుకు తరలిస్తున్నారు.

కొందరు మార్క్ ఫెడ్ మేనేజర్లు హైదరాబాదులో ఉన్న ఒక కీలకమైన అదే సంస్థలో పనిచేసే ఒక్క అధికారితో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ ను బట్టి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అయినా పైస్థాయి అధికారులు నోరు మెదపడం లేదంటే వారి భాగస్వామ్యం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రామగుండం ఫ్యాక్టరీలో నిలిచిన ఉత్పత్తి…
తెలంగాణతోపాటు 6 రాష్ట్రాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్) బుధవారం రాత్రి అమ్మోనియా కనెక్టర్ పైప్లాన్ లీక్ కావడంతో అక్కడ యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్ మరమ్మతులకు సుమారు 20 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి అంతరాయం కలగనుంది. ఇది తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కొరత బ్లాక్ మార్కెట్‌కు దారితీయకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పంటలకు యూరియా అత్యవసరం. ఇలాంటి సమయంలో ఉత్పత్తి నిలిచిపోవడం రైతులపై అదనపు భారాన్ని మోపుతుంది.

జూలై కోటా సగమే రాక…
తెలంగాణ రాష్ట్రానికి నెలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా… జూలై నెలలో కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే సరఫరా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ప్లాంట్ మూసివేత వారి ఆందోళనను మరింత పెంచింది. ఈ విషయంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇప్పటికే కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. ఆయన కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించగా… యూరియా సరఫరాను మెరుగుపరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

అక్రమ యూరియా నిల్వ చేస్తే చర్యలు: గోపి
రాష్ట్రంలో అక్రమ యూరియా నిలువలు ఉంటే చర్యలు తప్పవని డీలర్లను వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి హెచ్చరించారు. జిల్లా స్థాయిలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేసుకోవాలన్నారు. ఎవరైనా డీలర్లు, వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరాల మేరకే యూరియా పంపిణి చేయాలని ఆదేశించారు. కొన్ని జిల్లాలో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి లైన్ లో నిలుచుంటున్నారని అంగీకరించారు. యూరియా ఎరువుల అక్రమ నిల్వలు చేసి, అధిక ధరలకు అమ్మితే రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 89777-41771 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *