కవిత ‘ఢీ’ఆర్ఎస్ – తండ్రి పార్టీతో కవిత బంధానికి ముగింపు?

  • బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరికి భిన్నం
  • తన దారిలోకి పార్టీ వస్తుందని వ్యాఖ్యలు
  • అత్యంత ఘాటైన వ్యాఖ్యలతో మంటలు
  • ఆమె వైఖరిపై గులాబీ గూటిలో అంతర్మథనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కదలికలు, చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో పార్టీ వైఖరిని ఉద్దేశించి ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ అధిష్టానానికి, కవితకు మధ్య దూరం బాగా పెరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తండ్రితోనే తలపడ్డ కూతురు…
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతంగా నిర్వహించుకున్నామన్న సంతోషంలో పార్టీ అధిష్టానం ఉండగానే మే 2న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు కవిత ఓ లేఖ రాశారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆ లేఖలో ప్రశ్నించారు. అయితే ఈ లేఖ రాసిన 20 రోజుల తర్వాత గానీ బయటపడలేదు. అమెరికా పర్యటనలో ఉండగా లేఖ లీక్ అవ్వడం, తిరిగొచ్చాక విమానాశ్రయంలోనే ఆమె తీవ్రంగా స్పందించడం గమనార్హం. ‘కేసీఆర్ దేవుడేగానీ.. ఆయన చుట్టూ దయ్యాలున్నాయి’ అంటూ బహిరంగ విమర్శలు చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావును తప్పు పడుతూ మాట్లాడారు. ఇంత జరిగినా పార్టీ మాత్రం కవితను చూసీ చూడనట్లు వదిలేసింది. దీంతో ఈ అంశం సద్దుమణుగుతుందని చాలా మంది భావించారు.

బీసీ రిజర్వేషన్లపై భిన్న స్వరాలు…
తాజాగా బీసీ రిజర్వేషన్ల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు కవిత పార్టీకి పూర్తిగా దూరమవుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఒక వైఖరిని ప్రదర్శిస్తుంటే, కవిత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకోకుండా దానికి చట్టబద్ధత కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తుంటే… కవిత మాత్రం ప్రభుత్వాన్ని సమర్థించేలా మాట్లాడారు. ‘బీసీ రిజర్వేషన్ల కోసం మేం కోరినట్టుగా ఆర్డినెన్స్ తీసుకోవడం చాలా సంతోషం’ అంటూ ఏకంగా వేడుకలు కూడా నిర్వహించారు. అదే సమయంలో ఈ విషయమై సొంత పార్టీ విధానాన్ని కూడా తప్పుబట్టారు.

గులాబీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి…
ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ బీసీ నేతలు దిష్టిబొమ్మ దహనం చేస్తే, ‘వాళ్లకు పనీపాటా లేదు కాబట్టి అలా చేశారు’ అంటూ కవిత వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాను న్యాయ నిపుణులను సంప్రదించాకే ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చానని ఆమె చెప్పడం కొసమెరుపు. అంతటితో ఆగకుండా… ‘ఈ విషయంలో చివరికి బీఆర్‌ఎస్ కూడా నా దారికి రావాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. అత్యంత కీలకమైన అంశంపై పార్టీ వైఖరికి భిన్నంగా కవిత వ్యవహరించడం ఆమె పార్టీకి పూర్తిగా దూరమైనట్టేననే విశ్లేషణలకు దారితీస్తోంది.

కవిత-తీన్మార్ మల్లన్న వివాదం…
ఇటీవల తీన్మార్ మల్లన్న-కవిత వివాదంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ బహిరంగంగా స్పందించలేదు. స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా చాలా మంది నేతలు మల్లన్న వ్యాఖ్యలను ఖండించినా, బీఆర్‌ఎస్ మాత్రం కేవలం ఒక పత్రికా ప్రకటనతో సరిపెట్టింది. దీనిపై కవిత స్పందిస్తూ, ‘ఆ వ్యవహారాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అని అన్నారు. ఇలా రకరకాల పరిణామాలన్నీ కలిపి చూస్తే ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారనే అంచనాలు పెరుగుతున్నాయి.

ధిక్కార స్వరాన్ని ఉపేక్షించని పార్టీ…
పార్టీ చరిత్రను పరిశీలిస్తే ధిక్కార స్వరం వినిపించినప్పుడు కీలకమైన నేతలు మినహా మిగతా వారిని సస్పెండ్ చేయకుండా, వాళ్లంతట వాళ్లే వెళ్ళిపోయేలా చేసిందనే వాదన ఉంది. అలాంటి నాయకుల ఉనికిని గుర్తించకపోవడం, వాళ్ల గురించి అస్సలు మాట్లాడకపోవడం, ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం వంటి చర్యలతో వాళ్లంతట వాళ్లే పార్టీ నుంచి బయటికి వెళ్లేలా చేసినట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇదే జరుగుతుందనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో కవిత భవిష్యత్ ఏమిటన్నది వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *