- అనారోగ్యమని ఆదుకోమంటూ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని బడా హీరోలు
- వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ చిన్నపాటి సాయం చేయలేరా?
సహనం వందే, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. విలక్షణ పాత్రలతో
ప్రేక్షకులను మెప్పించిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన నేపథ్యంలో అంత స్థోమత తమకు లేదని ఆయన కుటుంబ సభ్యులు వాపోయారు. చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని ఆయన భార్య, కుమార్తె సినీ ప్రముఖులను, ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. వందల కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే టాలీవుడ్ నటులు… తోటి నటుడికి అనారోగ్య సమస్య ఏర్పడితే సాయం చేసే దిక్కు లేకుండా పోయింది. సినిమాలోనూ, బయట పెద్ద ఆదర్శవంతులుగా… హితవులు పలికే మన బడా హీరోలు చిన్నపాటి సాయం కూడా చేయలేకపోవడం దురదృష్టకరం.