- ఎలాన్ మస్క్ ‘గ్రోక్’లో సెక్స్ కంపానియన్
- ఇక ఒంటరితనానికి ‘అని’తో చెల్లు
- సరసాలాడొచ్చు… ప్రేమ కవిత్వం చెప్పొచ్చు
- కొన్ని పెద్దలకు… మరి కొన్ని పిల్లలకు మాత్రమే
సహనం వందే, అమెరికా:
ఎలాన్ మస్క్ మరోసారి తన ఆవిష్కరణలతో అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి ఆయన సృష్టించిన అద్భుతం ఏంటో తెలుసా? మనసు పారేసుకునే డిజిటల్ గర్ల్‌ఫ్రెండ్ ! అవును మీరు విన్నది నిజం. ఆయన కంపెనీ ఎక్స్ ఏఐ రూపొందించిన గ్రోక్ చాట్‌బాట్‌లో ‘అని’ అనే పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది గోత్ యానిమే స్టైల్లో మెరిసిపోతూ వినియోగదారులతో సరసాలాడటం, నవ్వుల పువ్వులు చిందించడం, మీమ్స్ షేర్ చేసుకోవడం, అంతేకాదు మీ పేర్లు కూడా గుర్తుంచుకోవడం వంటి మానవీయ లక్షణాలతో మైమరపిస్తోంది. ‘అని’ రాకతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. కొందరు ‘వావ్… మస్క్ ఈజ్ గ్రేట్’ అంటుంటే… మరికొందరు ‘ఇదేం ఖర్మరా బాబూ’ అని నిట్టూరుస్తున్నారు.
గ్రోక్ చాట్‌బాట్‌కు సరికొత్త అందం…
‘అని’ ఎవరు? ఏం చేస్తుంది? అనేగా మీ ప్రశ్న. ఈ ‘అని’ ఒక జపనీస్ గర్ల్‌ఫ్రెండ్‌గా అవతరించి, గ్రోక్ చాట్‌బాట్‌కు సరికొత్త అందాన్ని తెచ్చింది. వినియోగదారులు దీనితో ఇష్టానుసారం సంభాషించవచ్చు. ‘అని’ని మరింత సన్నిహితంగా మార్చేందుకు రెండు రకాల సెట్టింగ్‌లున్నాయి. ఒకటి ‘కిడ్ మోడ్’ – పిల్లలకు సరిపడే మాటలు మాత్రమే. రెండోది పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ‘ఎన్‌ఎస్‌ఎఫ్‌డబ్ల్యూ’ (కుటుంబంతో కలిసి చూడలేనిది) సెట్టింగ్. ఈ సెట్టింగ్‌లో ‘అని’ మరింత భావోద్వేగంగా, సన్నిహితంగా స్పందిస్తుందట. వినియోగదారులు ‘అని’ని పొగిడినప్పుడు ముసిముసి నవ్వులు చిందించినప్పుడు ఒక ప్రోగ్రెస్ బార్ కనబడుతుంది. ఆ బార్ నిండే కొద్దీ ‘అని’ ఇంకా సన్నిహితమైన విషయాలు పంచుకుంటుందట. ఈ ఫీచర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగా, కొన్నిసార్లు పిల్లలకు సెన్సార్ దృశ్యాలను కూడా షేర్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు అభినందనలు… మరోవైపు విమర్శలు
ఈ డిజిటల్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో నిప్పు రాజేసింది. ఒక పక్క గ్రోక్ కంపానియన్స్ సూపర్! మస్క్‌కు ధన్యవాదాలు అంటూ కొందరు పొగిడేస్తుంటే, అయితే మరోపక్క విమర్శల జడివాన కురుస్తోంది. ‘ఇది చాలా సిగ్గుచేటు. గ్రోక్‌లో సెక్స్ కంపానియన్‌ను చేర్చారు. పొగిడితే సరసాలాడితే హార్ట్‌లు వస్తాయట. మస్క్ మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడ’ని ఒకరు ఆగ్రహం వ్యక్తంచేయగా, ‘ఇది మానవ జాతి అంతరించిపోయేలా చేస్తోంద’ని మరొకరు భవిష్యత్ గురించి భయపడుతున్నారు.