- ప్రయాణికుల విశ్రాంతికి జపాన్ తరహా వసతి
- సింగిల్ బెడ్ మూడు గంటలకు రూ. 200
- డబుల్ బెడ్ మూడు గంటలకు రూ. 300
సహనం వందే, విశాఖపట్నం:
రైలు ప్రయాణికులకు విశ్రాంతి అందించేలా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సరికొత్త క్యాప్సుల్ హోటల్ ప్రారంభమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో తొలిసారిగా ఈ తరహా వసతి అందుబాటులోకి వచ్చింది. స్లీపింగ్ పాడ్స్ పేరుతో ఈ హోటల్‌ను మొదలుపెట్టారు. తక్కువ ధరకు ఏసీ గదులు, ఉచిత వైఫై, వేడి నీటి స్నానాలు, స్నాక్స్ వంటి సౌకర్యాలతో ప్రయాణికులకు చక్కటి విశ్రాంతి కేంద్రంగా ఇది మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లోని మొదటి నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న మొదటి అంతస్థులో ఈ క్యాప్సుల్ హోటల్‌ను ఏర్పాటు చేశారు. రైలు బోగీల్లోని బెర్త్‌లా వరుసగా పైన, కిందగా బెడ్లు అమర్చారు. ప్రతి బెడ్‌కు కర్టెన్ ఏర్పాటు చేయడంతో ప్రైవసీ సమస్య ఉండదు. ప్రస్తుతం ఈ హోటల్‌లో 73 సింగిల్ బెడ్‌లు, 15 డబుల్ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా 18 బెడ్‌లు కేటాయించారు.
సింగిల్ బెడ్ మూడు గంటలకు రూ. 200
ధరల విషయంలోనూ ఇది తక్కువ ఖర్చుతో అధిక లాభం కలిగించే క్యాప్సుల్ హోటల్‌గా నిలుస్తోంది. సింగిల్ బెడ్ మూడు గంటలకు రూ. 200. డబుల్ బెడ్ మూడు గంటలకు రూ. 300. 24 గంటలు ఉంటే సింగిల్ బెడ్‌కు రూ. 400, డబుల్ బెడ్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్యాప్సుల్ హోటల్ రైల్వే స్టేషన్‌ను చేరిన ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకించి రాత్రివేళలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ఇది చక్కటి వసతి. జపాన్ దేశంలో మొదలైన ఈ తరహా క్యాప్సుల్ హోటళ్లను విశాఖపట్నంలో మొదటిదిగా ఏర్పాటు చేయడం విశేషం.