‘నాడి’పట్టే చెయ్యి’గాడి’తప్పుతోంది-డబ్బు కోసం వైద్యులు గడ్డి

  • కోట్ల రూపాయలు దండుకుంటున్న దుస్థితి
  • ప్రైవేటు మెడికల్ కాలేజీలతో కుమ్మక్కు
  • ఎన్ఎంసీ తనిఖీ బృందాలలో ఉంటూ కక్కుర్తి
  • ఆయా బృందాలలో అవకాశం కోసం పైరవీలు
  • మరోవైపు ఘోస్ట్ ఫ్యాకల్టీగా అవతారం
  • వైద్య వ్యవస్థను నాశనం చేస్తున్న దుస్థితి

సహనం వందే, హైదరాబాద్:

______________________________________________________________________________________________________________________

ఇలా అనేకమంది వైద్యులు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇప్పటికే లక్షల్లో సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు అందుతున్నా… ప్రైవేటు ప్రాక్టీస్ ఉన్నా కొందరు ఇంకా కోట్ల సంపాదనకు కుయుక్తులు చేస్తున్నారు. అందుకోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా పేట్ల బుర్జు ఆసుపత్రి సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసిన డాక్టర్ రజనీరెడ్డి ఎన్ఎంసీ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆమె ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తనిఖీలు చేశారు. అయితే ఆమె బృందంలో సభ్యులు కొందరు యాజమాన్యం నుంచి లంచం తీసుకొని అనుమతులు ఇచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడింది. ఈమెపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇలా అనేకమంది డాక్టర్లు పక్కదారి పడుతున్నారు.

1.18 లక్షల ఎంబీబీఎస్… 74,306 పీజీ సీట్లు
దేశవ్యాప్తంగా 780 ప్రభుత్వ ప్రైవేట్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 414 ఉండగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 289 ఉన్నాయి. 20 ఎయిమ్స్, 57 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో 1.18 లక్షలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 74,306 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. పీజీ మెడికల్ సీట్లు ఉన్న ప్రతి కాలేజీలోనూ ఏడాదికి ఒకసారి ఎన్ఎంసీ తనిఖీలు చేస్తుంది. ఎంబీబీఎస్ సీట్లకు మాత్రం వాటి రెన్యువల్స్ కోసం మూడేళ్లకోసారి తనిఖీలు చేస్తారు. అంటే పీజీ మెడికల్ సీట్లున్న ప్రతి కాలేజీలో ఏడాదికి ఒకసారి తనిఖీలు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఒక్కో మెడికల్ కాలేజీలో 19 పీజీ మెడికల్ విభాగాలు ఉంటాయి.

ఎన్ఎంసీ బృందంలో చోటు కోసం ఫైరవీలు…
పెద్ద మొత్తంలో పీజీ మెడికల్ సీట్లు, వాటికి కాలేజీలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ఏడాదికోసారి, ఎంబీబీఎస్ సీట్ల రెన్యువల్ కోసం మూడేళ్లకోసారి తనిఖీలు చేస్తారు. అందుకోసం దేశవ్యాప్తంగా ప్రొఫెసర్లను ఈ తనిఖీ బృందాల్లో ఎన్ఎంసీ నియమించుకుంటుంది. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నాయకులు, సభ్యులు… అలాగే వైద్యరంగంలో నిపుణులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్లను ఈ తనిఖీ బృందాల్లో చేర్చుకుంటుంది. ఆ తనిఖీ బృందాల్లో ఉండడం కోసం అనేకమంది ప్రొఫెసర్లు ఫైరవీలు చేస్తారు. ఎందుకంటే అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చినందుకు కోట్ల రూపాయల ముడుపులు వస్తాయి కాబట్టి దానికోసం ఎగబడుతుంటారు. తమకు వచ్చే ముడుపుల నుంచి ఎన్ఎంసీకి చెందిన కొందరు అక్రమార్కులకు ఇచ్చుకునేలా ముందే ఒప్పందం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు ముందస్తు సమాచారం ఇస్తారు. ఎప్పుడొస్తారో తెలియజేస్తారు. ఆకస్మిక తనిఖీలు కాస్తా ముందుగానే సమాచారం ఇచ్చే తనిఖీలుగా మారిపోతుంటాయి. ఇటీవల మహావీర్ మెడికల్ కాలేజీకి వస్తున్నామని తెలియజేయడంతో ఆ కాలేజీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ విషయంపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ కథనం రాయడంతో అప్పుడు జరగాల్సిన తనిఖీ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

డాక్టర్ల అడ్డదారుల రూపాలు…

  • కొందరు డాక్టర్లు సంఘాలలో నాయకులుగా చలామణి అవుతారు. పైరవీలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. కొన్నిసార్లు అధికారులకు వత్తాసు పలుకుతూ డాక్టర్లకు ద్రోహం చేస్తుంటారు.
  • కొందరు డాక్టర్లు పెత్తనాలకే పరిమితమై రోగులను పట్టించుకునే దిక్కు ఉండదు. ఈ విషయంలో కొందరు సంఘాల నాయకులు ముందుంటారు.
  • మరికొందరు డాక్టర్లు వివిధ ఫార్మసీ కంపెనీలతో కుమ్మక్కవుతారు. వారు చెప్పిన మందులను ప్రమోట్ చేస్తారు. రోగులపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిసినప్పటికీ డబ్బు కోసం రాజీ పడుతుంటారు.
  • కొందరు డాక్టర్లు అధికారులుగా రూపాంతరం చెంది… అవినీతి అక్రమాల్లో కూరుకుపోతుంటారు. అందుకు నిలువెత్తు ఉదాహరణ మాజీ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన జీవనశైలి మొత్తం మారిపోతుంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *