- కస్టోడియల్ హింసకు బలైన యువకుడు
- జై భీమ్ సినిమా తరహాలో పోలీసుల తీరు
- దేశంలో సంచలనమైన తమిళనాడు కేసు
- అజిత్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ
సహనం వందే, చెన్నై:
పోలీసుల చిత్రహింసలకు బహుజనుడు బలయ్యాడు. చిన్నపాటి దొంగతనం ఆరోపణలతో అరెస్టు చేసి కొట్టి చంపేశారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆభరణాల దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న అజిత్ కుమార్ (27) అనే యువకుడు చిత్రహింసల కారణంగా మరణించాడు. పోస్ట్-మార్టమ్ నివేదికలు పోలీసుల క్రూరత్వాన్ని వెల్లడి చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు.
ఏ తప్పూ చేయకపోయినా…?
శివగంగై జిల్లాలోని తిరుప్పువనం సమీపంలో గల మదపురం బద్రకాళియమ్మన్ ఆలయంలో అజిత్ కుమార్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఆలయంలో దొంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 27న పోలీసులు అతన్ని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా అజిత్‌ను ఒక గోడౌన్‌లో, నీటి ట్యాంక్ దగ్గర, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రూరమైన హింసలో అతనికి 44 చోట్ల గాయాలు, అంతర్గత రక్తస్రావం జరిగాయి. అజిత్ తన చివరి క్షణాల్లో చొక్కా లేకుండా… భయంతో వణుకుతూ… తాను ఏ తప్పు చేయలేదని చెప్పినట్లు అతని తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. జూన్ 28న అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా అజిత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

బయటపడిన పోలీసుల అబద్ధాలు…
అజిత్ మరణంపై పోలీసులు మొదట ఇది సహజ మరణమని… అతడికి మూర్ఛవ్యాధి ఉందని… పోలీసుల అదుపు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్వయంగా గాయపడ్డాడని చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వాదనలన్నీ పోస్ట్-మార్టమ్ రిపోర్టుతో పటాపంచలయ్యాయి. ఆ నివేదికలో సిగరెట్ కాల్చిన గాయాలు, అంతర్గత రక్తస్రావం, కారం పొడి వాడిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఆధారాలు పోలీసుల చిత్రహింసకు అజిత్ బలయ్యాడని స్పష్టంగా రుజువు చేశాయి. కాగా ఈ కేసులో ఐదుగురు పోలీసు సిబ్బందిని అరెస్ట్ చేశారు.
కుల ఉన్మాదానికి పరాకాష్ట…
అజిత్ కుమార్ నాడార్ కులానికి చెందినవాడు. ఇది తమిళనాడులో వెనుకబడిన కులం. ఈ ఘటనలో పోలీసుల క్రూరమైన హింసను గమనిస్తే సామాజికంగా వెనుకబడిన వర్గాలపై పోలీసులు ప్రదర్శించే పక్షపాత వైఖరిని కూడా బహిర్గతం చేసిందని విమర్శకులు అంటున్నారు. తమిళనాడులో కస్టోడియల్ హింసకు గురవుతున్న వారిలో అత్యధికంగా దళితులు, వెనుకబడిన కులాలకు చెందినవారే ఉన్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసు జై భీమ్ రాజకన్ను కస్టోడియల్ డెత్ కేసుతో సమాంతరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.