ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినం – మంత్రివర్గం కీలక నిర్ణయం

  • విధినిర్వహణలో జవాబుదారీతనంపై దృష్టి
  • వివిధ విభాగాల్లో కొత్తగా 22 వేల ఉద్యోగాలు
  • అందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు
  • ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ల పనితీరు సమీక్ష
  • బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం

సహనం వందే, హైదరాబాద్:
ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

కొత్తగా 22 వేల ఉద్యోగాలు…
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత ఏడాదిన్నర వ్యవధిలో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థికశాఖను మంత్రివర్గం ఆదేశించింది.

బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం…
రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనూ, సామాజిక రంగంలోనూ నూతన అధ్యాయానికి నాంది పలకనుంది. గత మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది. విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కల్పించే రెండు బిల్లులను అదే రోజు అసెంబ్లీలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

హైకోర్టు ఆదేశాలతో…
ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ కేబినెట్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కుల గణన చేపట్టింది. ఈ గణాంకాలు, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగానే అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకుంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని మంత్రివర్గం తీర్మానించింది.

బీసీ రిజర్వేషన్ల అమలు విధివిధానాలు…
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్ గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో అవసరమైన సవరణలకు చర్యలు చేపడుతుంది.

రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీ, సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. అమిటీ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు అంటే స్థానిక విద్యార్థులకు 50 శాతం అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించడం గమనార్హం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *