- దళారులతో కుమ్మక్కై అధిక యూరియా ధరకు అమ్మకం
- హైదరాబాదు నుంచి చక్రం తిప్పుతున్న వైనం
- లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ఆఫీసర్
- రైతుల ఉసురు పోసుకుంటున్న అధికారులు
- కృత్రిమ కొరతతో ప్రైవేటు డీలర్ల పండగ…
సహనం వందే, హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే యూరియా రైతన్నల పాలిట ఓ కన్నీటి గాథగా మారింది. మార్క్‌ఫెడ్ సంస్థలో కీలకస్థానంలో ఉన్న ఓ అధికారి తన గుప్పిట్లో ఏకంగా 50 వేల టన్నుల యూరియాను పెట్టుకుని, దళారులతో కుమ్మక్కై అధిక ధరలకు అమ్ముకుంటూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న వైనం సంచలనం సృష్టిస్తోంది. మార్క్‌ఫెడ్ కార్యాలయం నుంచే ఈ అక్రమ దందాకు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దోపిడీలో జిల్లా మేనేజర్లు పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో యూరియా కొరతకు ఇదే ప్రధాన కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృత్రిమ కొరతతో ప్రైవేటు డీలర్ల పండగ…
కేంద్ర ప్రభుత్వం 50 కిలోల యూరియా బస్తాపై రూ. 1477.04 రాయితీ ఇచ్చి, కేవలం రూ. 266.50కు విక్రయించాలని నిబంధన విధించినా, ప్రైవేటు డీలర్లు దీన్ని అడ్డం పెట్టుకుని రూ. 350 నుంచి రూ. 400కు అమ్ముకుంటున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా 60 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా 40 శాతం యూరియా అమ్మకాలు జరగాల్సి ఉంది. మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారీ ఒప్పందంతో అధిక శాతం యూరియా పక్కదారి పడుతుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు డీలర్ల చేతుల్లోకి వెళ్లి కృత్రిమ కొరతకు దారితీస్తోంది. ప్రైవేటులో అధిక ధరకు అమ్ముకున్న తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు లెక్కలు తయారు చేయడం విమర్శలకు దారితీస్తోంది.
మహారాష్ట్రకు మళ్లింపు…
మహారాష్ట్రలో గుళికల రూపంలో ఉండే ఎరువులను తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ (ద్రావణం) వినియోగానికి అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో, అక్కడి రైతులు గుళికల యూరియా కోసం సరిహద్దులోని భైంసా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడి వ్యాపారులు, మార్క్ ఫెడ్ అధికారులు కుమ్మక్కై రూ. 266.50కు విక్రయించాల్సిన యూరియాను మహారాష్ట్ర రైతులకు రూ.350 నుంచి రూ. 400కు విక్రయిస్తున్నారు. ఇది యూరియా కృత్రిమ కొరతకు ప్రధాన కారణమవుతోంది. ‘వారం నుంచి ఎరువుల కోసం వెళ్తే డీఏపీ ఉందంటున్నారు. యూరియా స్టాక్ లేదంటున్నారు. వానలు పడుతున్నప్పుడే ఎరువులు వేస్తే నేలలో కరుగుతాయి. వానలు పోయాక వేస్తే లాభం ఏముంటుంది? అని ఉట్నూర్ కు చెందిన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల కొరతతో అన్నదాత ఆగ్రహం
రాష్ట్రంలో తీవ్రమవుతున్న యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం బెదిరింపుల బాట ఎంచుకోవడం విమర్శలకు దారితీస్తోంది. రోజుకు ఐదు టన్నులకు మించి యూరియా అమ్మిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యదర్శులను జైలుకు పంపుతామనే హెచ్చరికలతో కూడిన ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఈ నిబంధనను పర్యవేక్షించి, పాటించని ఏఈవో, ఏడీఏలకు షోకాజ్ నోటీసులు ఇస్తామని, అవసరమైతే సస్పెన్షన్ చేస్తామని ఆ ఆడియోలో హెచ్చరించడం గమనార్హం. రైతుకు ఒక నెలలో ఒకసారి మాత్రమే అదీ నాలుగైదు బస్తాలకు మించి యూరియా అమ్మకూడదని ఆ ఆడియోలో పేర్కొన్నారు.