10 గంటలు ‘మరణ’శాసనం – పని గంటలు పెంచిన కార్మిక ‘వ్యతిరేక’ శాఖ

  • విశ్రాంతి ఇచ్చి 12 గంటలు చేయించుకోవచ్చు
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు… ఈజ్ ఆఫ్ డెత్
  • విశ్రాంతి గంటలు హరి… గుండెకు ముప్పు
  • వ్యాపారులకు బానిసలుగా ఉద్యోగులు
  • మేడే స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పనివేళలను 8 గంటల నుండి 10 గంటలు కు పెంచుతూ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయంపై కార్మిక, ఉద్యోగ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త నిబంధన కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశ్రాంతితో కలుపుకుని ఏకంగా 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని జారీ చేసిన ఉత్తర్వులు కార్మికులను బానిసలుగా మార్చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంటే అనధికారికంగా 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తారని అర్థం అవుతుంది.

విశ్రాంతికి టైం ఏది?
తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం… వ్యాపార సంస్థల్లో ఉద్యోగుల పనివేళలు ఇప్పుడు 10 గంటలు పెరిగాయి. అయితే వారంలో 48 గంటలకు మించి పని చేయించకూడదని, ఒకవేళ 48 గంటలు దాటితే తప్పనిసరిగా ఓటీ (ఓవర్‌ టైం) చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఒక రోజులో 6 గంటల పని తర్వాత అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించవద్దని హితోక్తులు పలికింది. అంటే 12 గంటలు కూడా పని చేయించుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఉద్యోగుల పనివేళలకు కఠిన నిబంధనలు ఉండేవని, ఈ సవరణలు కేవలం వ్యాపార సంస్థల లాభాల కోసమేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మహిళల పనివేళల్లో మార్పులు చేసి, రాత్రి షిఫ్టుల్లోనూ పనికి అనుమతించి, పని వేళలను 9 నుండి 10 గంటలకు పెంచింది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం…
రోజుకు పది నుండి పన్నెండు గంటలు పని చేస్తే ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే అధిక పని ఒత్తిడి, ట్రాఫిక్‌లో ప్రయాణం, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులకు పెరిగిన పని గంటలు గుండెకు చేటు చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేడే పోరాటంలో ప్రధాన డిమాండ్‌ అయిన 8 గంటల పని దినం స్ఫూర్తికి ఈ నిర్ణయం తూట్లు పొడుస్తోందని విమర్శిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు నిద్రకు, కుటుంబంతో గడిపే సమయానికి పూర్తిగా దూరం అవుతారని, ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పని గంటలతో ఉత్పాదకత పెరగదు…
పని గంటలు పెంచడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందనే వాదన అసంబద్ధమని, అలసిపోయిన ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయలేరని, ఇది చివరికి కంపెనీలకు కూడా నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై తెలంగాణలోని కార్మిక, ఉద్యోగ సంఘాలు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. లేకపోతే ఉద్యోగుల ఆగ్రహం మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *