- కేంద్రమంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- రైల్వే శాఖ సహకారం లేకపోవడంతో సమస్య
సహనం వందే, న్యూఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర రైతుల అవసరాల కోసం యూరియా సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను వివరించారు.
రైతుల ఇబ్బందులపై దృష్టి…
వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైనప్పటికీ, కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయని వివరించారు. ఈ కొరత వల్ల రైతులు పడుతున్న ఆందోళనను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జులై నెల సరఫరాలో లోటు
జులై నెలకు సంబంధించి తెలంగాణకు 63 వేల మెట్రిక్ టన్నుల దేశీయ యూరియా, 97 వేల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియా సరఫరా చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిందని, మిగిలిన యూరియాను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా నీరు అందుతుండటం, వ్యవసాయం ఊపందుకుంటున్న సమయంలో ఈ కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోందని ఆయన వివరించారు.
దేశీయ కోటా పెంపు, రైలు రవాణా సమస్యలు
తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియా కోటాను పెంచాలని ముఖ్యమంత్రి జేపీ నడ్డాను కోరారు. అంతేకాక యూరియా సరఫరాకు అవసరమైన రైల్వే రేక్‌ల కేటాయింపులోనూ లోటు ఉందని, రేక్‌ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే శాఖ సహకారం లేకపోవడం వల్ల యూరియా సరఫరాలో ఆలస్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.