- ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేతనాల్లో వివక్ష
- సుప్రీం కోర్టు అండ ఉన్నా… సర్కారు బండ
- ప్రభుత్వాలది శ్రమ దోపిడి అని సుప్రీం వ్యాఖ్య
- సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి
- సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతర్
- సమాన పని చేసినా జీతభత్యాల్లో వివక్ష
సహనం వందే, హైదరాబాద్:
ఆధునిక ప్రపంచంలో సమాన పనిచేసే ఉద్యోగుల వేతనాల మధ్య వివక్ష ఉండటం అనాగరికం. ఇది ఫ్యూడల్ వ్యవస్థ లక్షణానికి నిదర్శనం. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో సమాన పనికి – సమాన వేతనం అనే ప్రాథమిక సూత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు ఔట్‌సోర్సింగ్ విధానం పేరుతో తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి అన్యాయానికి పాల్పడితే ఆ ఉద్యోగులు ఇంకెవరికి చెప్పుకోవాలి? తెలంగాణలో దాదాపు లక్షన్నరమంది వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. అంతేకాదు కొందరు సీనియర్ అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు.
వేతనాల్లో తేడా శ్రమ దోపిడీనే: సుప్రీంకోర్ట్
జగ్జీత్ సింగ్ కేసు (2016)లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనే హక్కును మరింత బలపరిచింది. తాత్కాలిక ఉద్యోగులకు కూడా రెగ్యులర్ వేతనాలు ఇవ్వాల్సి ఉందని తీర్పు ఇచ్చింది. ఒకే విధమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకే రకమైన పని చేస్తున్న వ్యక్తికి (ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్టు పేరిట) మరొకరి (పర్మినెంట్ ఉద్యోగి) కంటే తక్కువ జీతం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ‘తక్కువ వేతనం తీసుకుని పని చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని, స్వీయ విలువను తగ్గించుకుని మరీ తక్కువ జీతానికి పనిచేస్తారు. అలా చేయకపోతే తమపై ఆధారపడిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని తెలుసు’ అని తీర్పు రాసిన జస్టిస్ ఖేహర్ పేర్కొన్నారు. ఒకే రకమైన పరిస్థితుల్లో, ఒకే రకమైన పని చేసే వారి మధ్య వేతనాల్లో తేడా ఉండటమంటే శ్రమను దోచుకోవడమే. ఇది కచ్చితంగా అణచివేత చర్యే’ అని స్పష్టం చేశారు. మోహనలాల్ కేసు (2021)లో కూడా సుప్రీంకోర్టు తాత్కాలిక ఉద్యోగులను పునరుద్ధరించడంలో ప్రభుత్వాల నిబంధనలలో స్పష్టత అవసరమని చెప్పింది. కోర్టుల ద్వారా వచ్చిన తీర్పులు ముఖ్యంగా సమాన వేతనం తీర్పులు త్వరగా అమలు కావాలి.

తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ల డిమాండ్లు…
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగ శాఖలు, సంస్థలలో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి తేదీన జీతాలు ఇస్తున్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించారని, కానీ తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని జేఏసీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాలు, ఏజెన్సీలు నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా వేధిస్తున్నాయని విమర్శించింది. ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని కోరుతున్నారు.

పులి లక్ష్మయ్య, అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాం. మా శ్రమను గుర్తించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత లేక ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయంలో ఉద్యోగులు జీవనం సాగిస్తున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: మునిగంటి జగదీష్, కోశాధికారి, తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ
కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వల్ల ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం పడకుండా సుమారుగా మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఉద్యోగస్తులకు పెరిగే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే సకాలంలో జీతాలు ఇవ్వడానికి, ఈఎస్ఐ, ఈపీఎఫ్ కూడా సరైన సమయంలో కార్పొరేషన్ ద్వారా ఇవ్వటానికి అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల కూడా ఉద్యోగస్తులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంది.
