మస్క్… ‘ది అమెరికా పార్టీ’

  • ‘కొత్త పార్టీ అవసరం… ఇది విధి’ అని మస్క్ కామెంట్
  • ఎక్స్ పోస్టులో 80 శాతం మంది మద్దతు… దూకుడు మీదున్న మస్క్
  • అమెరికా అధ్యక్ష పీఠంపై ఎలాన్ మస్క్ కన్ను
  • ట్రంప్ తో విభేదాల నేపథ్యంలో సంచలన నిర్ణయం

ఎలాన్ మస్క్… ప్రపంచంలోనే సంచలనమైన పేరు ఇది. ఆయన ఏ ప్రాజెక్టు చేపట్టినా అది సక్సెస్ అవ్వాల్సిందే. అందుకోసం మస్క్ ఎంత దూరమైనా వెళ్తాడు. రిస్కులు చేయడంలోనే మస్క్ గొప్పతనం ఉంది. అలా రిస్కులు చేసి ప్రపంచ కుబేరుడు అయ్యాడు. అల్లాటప్ప బిజినెస్ లు కాకుండా వినూత్నమైన ఆలోచనలతో దూకుడుగా అడుగులు వేశాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్ష పీఠంపైనే కన్నేశాడు. అందుకోసం ‘ది అమెరికా పార్టీ’ ఏర్పాటుపై అధ్యయనం ప్రారంభించాడు. ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుపై మస్క్ దృష్టి సారించారు.

‘కొత్త పార్టీ… విధి రాసిన రాత’ మస్క్ కామెంట్…
జూన్ 5న మస్క్ తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించిన పోల్ చర్చనీయాంశంగా మారింది. ‘అమెరికాలో 80 శాతం మధ్యవర్తి ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ పోల్‌కు 56 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇందులో 80.4 శాతం మంది కొత్త పార్టీకి మద్దతు పలకడం విశేషం. ఈ ఫలితాలను ఉటంకిస్తూ మస్క్, ‘ప్రజలు అమెరికాకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్నారు. ఇది విధి’ అని పేర్కొన్నారు. ఒక యూజర్ అమెరికా పార్టీ అనే పేరును సూచించగా, మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు. ‘అమెరికా పార్టీ అనే పేరు చాలా బాగుంది. నిజంగా అమెరికాను ప్రాతినిధ్యం వహించే పార్టీ’ అని రిప్లై ఇచ్చారు. ఈ పేరు గతంలో మస్క్ స్థాపించిన అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీకి దగ్గరగా ఉంది. ఈ కమిటీ 2024 ఎన్నికల్లో ట్రంప్, ఇతర రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా 23.9 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. మస్క్ ఈ కొత్త పార్టీతో తన రాజకీయ అరంగేట్రం చేస్తారనే చర్చ జరుగుతోంది.

కొత్త పార్టీకి ఎదురయ్యే సవాళ్లు
అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం అంత సులభం కాదు. డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా అమెరికా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. గతంలో రాస్ పెరోట్ 1992లో 19 శాతం ఓట్లతో మూడో పార్టీ అభ్యర్థిగా ప్రయత్నించినప్పటికీ, రెండు-పార్టీల వ్యవస్థను ఛేదించలేకపోయారు. రాష్ట్రాల వారీగా ఉన్న కఠినమైన బ్యాలెట్ యాక్సెస్ చట్టాలు, పరిమిత మీడియా కవరేజ్, ఫైనాన్సింగ్ సమస్యలు మూడో పార్టీకి పెద్ద అడ్డంకులు. అయినప్పటికీ మస్క్ అపారమైన ఆర్థిక శక్తి, ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అపారమైన ఫాలోవర్స్ ఉండటం ఈ సవాళ్లను అధిగమించడంలో సాయపడవచ్చు. భవిష్యత్తులో అమెరికాకు మస్క్ అధ్యక్షుడైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *