- నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలకు ల్యాబ్ లలో పరీక్షలు
- మూడు రోజులు… 37 ఆయిల్ పామ్ తోటలు
- కేంద్ర వ్యవసాయమంత్రి ఆదేశాలతో పరిశీలన
- ఎలాంటి మొక్కలు ఇచ్చారో క్షేత్రస్థాయిలో స్టడీ
- గత సర్కారులో జరగడంపై తుమ్మల ఆగ్రహం
- టెన్షన్ పడుతున్న ఆయిల్ ఫెడ్ యంత్రాంగం
సహనం వందే, హైదరాబాద్:
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించడం సంచలనం సృష్టిస్తుంది. రైతులకు ఇచ్చిన మొక్కలు సరైనవేనా? కంపెనీ నుంచి తెచ్చినవి… అక్కడ ఉన్నవి ఒకటేనా? మధ్యలో ఏమైనా తేడాలు జరిగాయా? కంపెనీ నుంచి తెచ్చినవి కాకుండా స్థానికంగా అశాస్త్రీయ పద్ధతిలో పెంచిన మొక్కలు ఏమైనా రైతులకు ఇచ్చారా? ఇలాంటి వాటన్నింటినీ డీఎన్ఏ పద్ధతిలోనే తేల్చనున్నారు.
కల్లింగ్ మొక్కల సరఫరాపై ఫిర్యాదులు…
అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూర్, మహబూబాబాద్, నారాయణపేట, గద్వాల్ తదితరచోట్ల జన్యు లోపం ఉన్న కల్లింగ్ మొక్కలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందం పర్యటిస్తుంది. ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు జన్యుపరమైన లోపాలను కనుగొనేందుకు ప్రత్యేకంగా వారి వెంట ఒక మినీ ల్యాబ్ తెస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు తోటల్లో పరిశీలించేటప్పుడు అనుమానం వచ్చిన చోట వాటి నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయిస్తారు. అంతే కాదు ఆయిల్ ఫెడ్ కు మొలకలు సరఫరా చేసిన కంపెనీ ఏది? సరఫరాదారు నుండి దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ల పనితీరు ఎలా ఉంది? మార్గదర్శకాల ప్రకారం నర్సరీలో మొక్కలు పెంచారా? నర్సరీ దశలో కల్లింగ్ జరిగిందా? జరిగితే ఎంత శాతం? రైతులకు పంపిణీ చేసే సమయంలో ఆయిల్ పామ్ మొలకల వయస్సు ఎంత? ఈ వివరాలతో కూడిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరాన్ని బట్టి డీఎన్ఏ పరీక్షలు చేస్తారు.
37 మంది రైతులు… మూడు రోజులు
కేంద్ర వ్యవసాయశాఖ పంపించిన జాబితాలోని రైతుల క్షేత్రాలను ఈ బృందం పరిశీలిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆయిల్ ఫెడ్ కు, అలాగే బృందానికి 37 మంది రైతులకు చెందిన ఆయిల్ పామ్ తోటల జాబితాను పంపించింది. వాటిల్లో అక్రమాలు జరిగాయని… కల్లింగ్ మొక్కలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ 37తో పాటు మరో 47 మంది రైతులకు చెందిన ఆయిల్ పామ్ అక్రమాల ఫిర్యాదులు అందాయి. వాటిని కూడా మరో విడతలో పరిశీలిస్తారని ఆయిల్ ఫెడ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర బృందానికి తాము అన్ని విధాలా సహకరించి రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య తెలిపారు.



గత ప్రభుత్వ అక్రమాలపై తుమ్మల ఆగ్రహం…?
గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాలన్నీ జరగడంతో ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ అక్రమాలు బయటపడితే… అప్పటి ప్రభుత్వ పెద్దల మీద నింద మోపవచ్చని యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నప్పటికీ సహకరించాలని ఈ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

అయితే గతంలో జరిగిన అక్రమాలకు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులే బాధ్యులు కావడం యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. దీని ద్వారా ఆయిల్ ఫెడ్ లో సమూల ప్రక్షాళనకు రంగం సిద్ధం చేయవచ్చని మంత్రి తుమ్మల భావిస్తున్నట్లు సమాచారం.