- భారత సంతతి న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై పిచ్చి కూతలు
- టెక్సాస్ కాంగ్రెస్ మెన్ బ్రాండన్ గిల్ జాత్యాంహంకారం
- పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించని వారు ఇక్కడ ఉండకూడదని వ్వ్యాఖ్య
- ‘మీరు బర్గర్లను ఫోర్క్‌తో తినగలరా’ అంటూ ప్రశ్నిస్తున్న నెటిజెన్లు
సహనం వందే, న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోరాన్ మందానిపై టెక్సాస్ కాంగ్రెస్ మెన్ బ్రాండన్ గిల్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. బిర్యానీని మందాని చేతులతో తింటున్న వీడియోను రీట్వీట్ చేసిన గిల్, “అమెరికాలోని నాగరిక మానవులు ఇలా తినరు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించని వారు మూడో ప్రపంచానికి తిరిగి వెళ్ళాల’ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
గిల్ వ్యాఖ్యలపై ఆగ్రహం…
మందాని సోషలిజం, ఇస్లాం, పాలస్తీనా వంటి అంశాలపై ప్రశ్నలకు సమాధానం ఇస్తూ… బిర్యానీని చేతులతో తిన్నారు. ‘మూడో ప్రపంచంలో పెరిగిన వ్యక్తిగా, పాలస్తీనా పోరాటంపై నాకు భిన్నమైన అవగాహన ఉంద’ని మందాని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వీడియోపై గిల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కొందరు వినియోగదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిజ్జాను చేతులతో తింటున్న చిత్రాలను షేర్ చేస్తూ గిల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ‘టాకోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్‌లను మీరు ఫోర్క్‌తో తింటారా?’ అని ఒక వినియోగదారు ప్రశ్నిస్తూ గిల్ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపారు.
మందాని రాజకీయ ప్రస్థానం…
33 ఏళ్ల భారత-అమెరికన్ రాజకీయ నాయకుడు జోరాన్ మందాని, ప్రముఖ చలనచిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు. న్యూయార్క్ సిటీ మేయర్ రేసులో డెమోక్రాటిక్ నామినీగా చరిత్ర సృష్టించారు. ఆయన బాలీవుడ్ థీమ్‌తో కూడిన ఎన్నికల ప్రచార వీడియోలతో గణనీయంగా ఆదరణ పొందారు.