తెలంగాణ ఆయిల్ ఫెడ్ నర్సరీలలో కేంద్ర బృందం

  • అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటన
  • రైతుల తోటల్లోకి ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు
  • రైతు నేతలతోనూ మాట్లాడిన అధికారులు
  • విచారణకు 10 రోజులు పడుతుందని వెల్లడి
  • మరిన్ని వివరాలు కావాలని ఆదేశాలు
  • మంత్రి తుమ్మల వల్లే ఆయిల్ పామ్ అభివృద్ధి
  • ఆయనకు చెడ్డ పేరు తీస్తున్న అధికారులు
  • ఆయిల్ ఫెడ్ యంత్రాంగం తీరుపై అసంతృప్తి

సహనం వందే, అశ్వారావుపేట: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు గురువారం అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటించారు. నర్సరీలు, జన్యు లోపం ఉన్న మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందం పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఎంవీ ప్రసాద్, రామచంద్రుడు సహా ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య, నాయకులు పిన్నమనేని మురళి, మద్దుకూరు నారాయణరావు పాల్గొన్నారు. అశ్వారావుపేటలో నున్న కృష్ణ, కుంచెం సుబ్బారావు, ఆళ్ళ నాగేశ్వరావు తోటలను పరిశీలించారు. దమ్మపేట మండలంలో మూడు తోటలకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు.

వారు పరిశీలిస్తున్న అంశాలు ఏంటంటే?
ఐఐఓపీఆర్ అధికారులు ఆయిల్ ఫెడ్ కు ప్రశ్నలు గుప్పించారు. అందుకు సంబంధించి ఇప్పటికే వారు ఇచ్చిన చెక్ లిస్ట్ ఆధారంగా ఈ బృందం విచారణ చేపడుతుంది. ఆయిల్ ఫెడ్ కు మొలకలు సరఫరా చేసిన కంపెనీ ఏది? టెనెరా హైబ్రిడ్ మొక్కల వివరాలు? సరఫరాదారు నుండి దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ల పనితీరు (ఎఫ్ఎఫ్ బీ దిగుబడి, ఎత్తు మొదలైనవి). ఐఐఓపీఆర్ మార్గదర్శకాల ప్రకారం నర్సరీలో మొక్కలు పెంచారా? నర్సరీ దశలో కల్లింగ్ జరిగిందా? జరిగితే ఎంత శాతం? రైతులకు పంపిణీ చేసే సమయంలో ఆయిల్ పామ్ మొలకల వయస్సు ఎంత? పంపిణీ సమయంలో మొలకలు ఏకరీతిగా లేదా పొట్టిగా ఉన్నాయా? ఈ వివరాలతో కూడిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నిటిని పరిశీలించాలంటే మరో 10 రోజుల సమయం పడుతుందని… తదుపరి మరోసారి పర్యటనకు వస్తామని వారు వెల్లడించారు. ఆ లోగా మరిన్ని వివరాలు అందజేయాలని అధికారులను కోరారు. తేడా ఉన్న చెట్లకు రంగులు, నెంబర్లు వేయాలని సూచించారు. తోటలకు సంబంధించిన లే అవుట్, రికార్డ్ లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

విచారణలతో అధికారుల ఉక్కిరిబిక్కిరి…
ఆయిల్ ఫెడ్ పై వచ్చిన ఆరోపణలు… వాటిపై జరుగుతున్న విచారణలతో ఆ సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్య, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు హాజరై తమ వాదనలు వినిపించారు. అనంతరం కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ పలు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని 30 రోజుల్లోగా తనకు నివేదిక రూపంలో ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను పరిశీలిస్తున్నారు.

మంత్రి తుమ్మల విజన్ కు అధికారుల అడ్డు…
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజన్ ఉన్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సహచరులు. ఆయన హయాంలోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి అయిందని అందరూ అంటుంటారు. ఆయిల్ పామ్ సాగు కూడా ఆయన చొరవతోనే అశ్వరావుపేట ఏరియాలో అభివృద్ధి అయింది. ఆయన కూడా అదే ప్రాంతం నుంచి వచ్చిన నేత కావడంతో ఆయిల్ పామ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులను ప్రోత్సహించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాన్ని విస్తరింప చేయాలని కృషి చేస్తున్నారు.

కానీ కొందరు అధికారులు మాత్రం ఆయన విజన్ కు అడ్డుపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఆయిల్ ఫెడ్ లో జరుగుతున్న అక్రమాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయిల్ పామ్ సాగును పెంచాలని భావిస్తుంటే… కొందరు అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మీడియాలో వరుస కథనాల నేపథ్యంలో అసలు ఆయిల్ ఫెడ్ లో ఏం జరుగుతుందో తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తుమ్మల ఆదేశించినట్లు సమాచారం. ఆయిల్ పామ్ సాగు వ్యవహారం తనకు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రతిష్టాత్మకమని ఆయన అన్నట్లు తెలిసింది. తన ప్రాంత రైతులకు నష్టం జరిగే చర్యలు ఏమాత్రం సహించబోనని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *