- మెదడు పాఠం వివరించేందుకు ఆవు మెదడు ప్రదర్శన
- బీజేపీ, హిందూ సంఘాల నిరసన వెల్లువ
- వివాదం కావడంతో ఉపాధ్యాయురాలు సస్పెండ్
సహనం వందే, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవు మెదడు ను తీసుకొచ్చి తరగతి గదిలో ప్రదర్శించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో విద్యార్థులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఆ ఉపాధ్యాయురాలుని సస్పెండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యలాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ఉపాధ్యాయురాలు ఖాసీమ్ బీ… 10వ తరగతి విద్యార్థులకు మానవ మెదడు గురించి వివరించేందుకు ఆవు మెదడును తరగతికి తీసుకొచ్చారు. ఆమె ఈ మెదడుతో ఫోటోలు తీసి పాఠశాల వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడంతో వైరల్ అయింది.
హిందూ సంఘాల నిరసన…
విద్యార్థులు ఈ ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఉపాధ్యాయురాలు వారి ఆందోళనలను పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఇతర ఉపాధ్యాయులు ఈ విషయం గురించి తెలుసుకుని ఖాసీమ్ బీ ను నిలదీయడంతో ఫోటోలను డిలీట్ చేశారు. అయినప్పటికీ ఈ ఘటన బయటకు పొక్కడంతో బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ ఘటనను మతపరమైన మనోభావాలకు విరుద్ధమని ఖండించారు. 3డీ మోడళ్లు, డిజిటల్ సాధనాలు అందుబాటులో ఉండగా ఆవు మెదడును తీసుకురావడం సరికాదని వారు మండిపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన ఆగింది. ఈ ఘటనపై విచారణ పెండింగ్‌లో ఉండగానే ఉపాధ్యాయురాలు ఖాసీమ్ బీ ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది.