లోకేష్ రెడ్ బుక్ ఉగ్రరూపం – జగన్ కు చుక్కలు….

  • ఒక్కొక్కరిని జైలుపాలు చేస్తున్న డైనమైట్
  • ముఖ్యమంత్రి వ్యవహారాలపై బాబు శిక్షణ
  • దగ్గరుండీ అన్నీ నేర్పిస్తున్న చంద్రబాబు
  • ప్రధాని వద్దకు ప్రత్యేకంగా పంపిన సీఎం
  • మోడీ విశాఖ వచ్చినప్పుడు లోకేష్ పై ప్రశంస
  • లోకేష్ కనుసన్నల్లోనే ఐఏఎస్, ఐపీఎస్ లు
  • అతను చెప్పినట్లే నడుస్తున్న యంత్రాంగం
  • లోకేష్ ఇమేజ్ ముందు పవన్ వెలవెల
  • టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన నారా వారసుడు

సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మంటలు రేపుతుంది. జగన్ పరివాహరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కిందిస్థాయి కార్యకర్త మొదలు జగన్ వరకు ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ లోన పడేస్తున్నారు. జగన్ కు అండగా నిలబడిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారు. కారు కింద పడి చనిపోయినందుకు ఏకంగా జగన్ నే టార్గెట్ చేశారు.

ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అంతే కాదు సాక్షి టీవీలో పొలిటికల్ ఎనలిస్ట్ గా పని చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును కూడా జైలుకు పంపించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇలా ఆ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తీరు జగన్ చుట్టూ ఉన్న వారిలో వణుకు పుట్టిస్తుంది. లోకేష్ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు.చంద్రబాబు కాస్త చూసీచూడనట్లు ఉంటారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు అతని వారసుడు లోకేష్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ప్రతిపక్ష పార్టీని చిన్నాభిన్నం చేస్తున్నారు.

లోకేష్ కు యంత్రాంగం సరెండర్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇప్పుడు నారా లోకేష్ చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆయన హవా కొనసాగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ సహా మొత్తం ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తుంది. ముందు లోకేష్ ను కలిసిన తర్వాతే తన వద్దకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసొచ్చారు. యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వచ్చిన ప్రధాని మోడీ… లోకేష్ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కాబోయే ముఖ్యమంత్రి

లోకేష్ అన్న ప్రచారాన్ని టీడీపీ నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంతేకాదు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి వ్యవహారాలు ఎలా ఉంటాయో లోకేష్ కు దగ్గరుండి నేర్పిస్తున్నారు. ఏ మాత్రం వీలున్నా రాబోయే ఎన్నికలలోపే లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ కార్యకర్తలకు అండ…
చంద్రబాబు నాయుడు పార్టీని నిర్మించి ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ పార్టీని, కార్యకర్తలను కాపాడుకున్నారు. కార్యకర్తలే ఆ పార్టీకి బలమైన పునాది. అంతటి పటిష్టమైన కార్యకర్తలు ఉన్న ప్రాంతీయ పార్టీ దేశంలో చాలా అరుదు. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా నిర్మించుకోవాలి? కార్యకర్తలను ఎలా తయారు చేసుకోవాలి? వారిని ఎలా కాపాడుకోవాలి? ఎలా అండగా నిలబడాలి? ఇలాంటి విషయాలపై లోకేష్ కు చంద్రబాబు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. దీంతో లోకేష్ కార్యకర్తల పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి అడుగుజాడల్లో తనయుడు నడుస్తున్నారని అంటున్నారు. అంతేగాక గతంలో లోకేష్ పై అనేక మీమ్స్ వచ్చేవి. సోషల్ మీడియాలో అతని భాషను హేళన చేసేవారు. కానీ ఇప్పుడు లోకేష్ పూర్తిగా మారిపోయారని పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేది ఎవరు అని ఇప్పటివరకు అనుకునే వాళ్ళమని… అయితే ఇప్పుడు లోకేష్ ను చూస్తుంటే అటువంటి అనుమానం పటాపంచలైందని అంటున్నారు.

లోకేష్ ముందు పవన్ వెలవెల…
ఇప్పుడు ఆ రాష్ట్రంలో లోకేష్ ముందు పవన్ వెలవెల పోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. లోకేష్ గ్రాఫ్ పెరుగుతుంటే… పవన్ గ్రాఫ్ అక్కడే ఉండిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సినీ అభిమానుల మాస్ అట్రాక్షన్ తప్ప పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంలో తన మార్కును చూపెట్టుకోలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాస్ ఇమేజ్ వరకే పవన్ పరిమితం అవుతున్నారని… కానీ లోకేష్ మాత్రం అధికార యంత్రాంగం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారని అంటున్నారు. అలాగే పార్టీలో కూడా తన పవర్ చూపించుకుంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు

ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. నాగబాబును మంత్రిని చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు… ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇద్దరు సినీ నటులను మంత్రివర్గంలో ఉంచుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చంద్రబాబు అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏమైనా చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *