తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

  • వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ ఆరా
  • నర్సరీలు, మొక్కలపై విచారణకు ఆదేశం
  • 26, 27, 28 తేదీల్లో శాస్త్రవేత్తల పర్యటన?
  • ఆయిల్ ఫెడ్ కు పలు ప్రశ్నలతో చెక్ లిస్ట్
  • ఈరోజు సాయంత్రానికి నివేదికకు హుకూం

సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం తెలంగాణలో పర్యటించనుంది.

ఈనెల 26, 27, 28 తేదీల్లో ఏవైనా రెండు రోజుల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు ఆయిల్ ఫెడ్ లోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ పర్యటనకు ముందు సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆ రెండు సంస్థల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయిల్ ఫెడ్ కు కొన్ని ప్రశ్నలతో కూడిన చెక్ లిస్టును పంపించారు. వాటిని సోమవారం సాయంత్రంలోగా అందజేయాలని స్పష్టం చేశారు. ఒకవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సోమవారం విచారణ చేపడుతుండగా… మరోవైపు కేంద్ర బృందం ఈ నెలాఖరున పర్యటించనుండటంతో ఆయిల్ ఫెడ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

రైతులకు ఎన్ని నెలల మొలకలు ఇచ్చారు?
ఐకార్, ఐఐఓపీఆర్ అధికారులు ఆయిల్ ఫెడ్ కు ప్రశ్నలు గుప్పించారు. అవసరమైన సమాచారం పంపాలని ఆదేశించారు. అందుకు సంబంధించి కొన్ని ప్రశ్నలతో కూడిన చెక్ లిస్ట్ పంపించారు. దానిద్వారా కీలకమైన సమాచారాన్ని రాబట్టడానికి అవకాశం ఉంది. వాటి ఆధారంగా ఆ బృందం ఈ నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించనుంది. ఆయిల్ ఫెడ్ కు మొలకలు సరఫరా చేసిన కంపెనీ ఏది? టెనెరా హైబ్రిడ్ మొక్కల వివరాలు? సరఫరాదారు నుండి దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ల పనితీరు (ఎఫ్ఎఫ్ బీ దిగుబడి, ఎత్తు మొదలైనవి)… అలాగే అందుకు సంబంధించిన రికార్డులను అందజేయాలి. ఐఐఓపీఆర్ మార్గదర్శకాల ప్రకారం నర్సరీలో మొక్కలు పెంచారా? నర్సరీ దశలో పీఈక్యూ వివరాలు? అందుకు సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. నర్సరీ దశలో కల్లింగ్ జరిగిందా? జరిగితే ఎంత శాతం? రికార్డుల ప్రకారం నర్సరీలో గమనించిన అసాధారణ పరిణామాలు ఏంటి? రైతులకు పంపిణీ చేసే సమయంలో ఆయిల్ పామ్ మొలకల వయస్సు ఎంత? పంపిణీ సమయంలో మొలకలు ఏకరీతిగా లేదా పొట్టిగా ఉన్నాయా?

ఈ ప్రశ్నలన్నింటికీ సోమవారం సాయంత్రం నాటికి సమాధానం ఇస్తూ నివేదిక అందజేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అక్రమాలను దాచిపెట్టి మాయ చేసేలా రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు… ఈ పరిస్థితులు చూస్తుంటే తనకు బాధ వేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

నేడు కేంద్ర ఎస్టీ కమిషన్ విచారణ…
నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరగనుంది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరుగుతుంది. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు ఈ విచారణకు హాజరవుతున్నారా లేదా తెలియడం లేదు. కాగా ఫిర్యాదు చేసిన గిరిజన రైతు శ్రీరాములుతో పాటు మరో నలుగురు రైతు నాయకులు ఈ విచారణకు హాజరవుతున్నారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలపై కమిషన్ బృందానికి ఒక నివేదిక అందజేయాలని రైతు నేతలు భావిస్తున్నారు. కాగా ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అధికారులు మాత్రం ఈ సమస్యను పక్కదారి పట్టించేలా నివేదికలు తయారు చేసినట్లు ఆయిల్ ఫెడ్ కు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *