తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

  • నియామకాలు ఎప్పుడని నిలదీత
  • మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర
  • ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు.

మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర
2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1 నియామక ప్రక్రియ గత మూడేళ్లుగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. రెండుసార్లు ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత కూడా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 19న కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఎట్టకేలకు గత సంవత్సరం అక్టోబరులో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను విడుదల చేసి, ఆపై ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులు కూడా నిర్వహించింది. దీంతో నియామకాలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే గ్రూప్ 1 అధికారులుగా తమ పిల్లలు విధుల్లో చేరుతారని కుటుంబాలు సంబరాలు చేసుకున్న తరుణంలో అనూహ్యంగా నియామకాలు నిలిచిపోవడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ర్యాంకర్లు వాపోయారు.

ఆలస్యంతో అష్టకష్టాలు…
నియామక ప్రక్రియ ఆలస్యం అవ్వడం వల్ల తాము ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులను ర్యాంకర్లు వివరించారు.

1) ఆర్థిక సమస్యలు: గ్రూప్-I రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడం, సంవత్సరాల తరబడి వాటి కోసం ఎదురుచూశాం. పరీక్షల కోసం సన్నద్ధమవుతూ, మూడేళ్లుగా ఈ ప్రక్రియలో కొనసాగుతుండడంతో అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన తమలో చాలా మంది అప్పుల పాలైనట్లు వెల్లడించారు.

2) ఉద్యోగాలకు రాజీనామాతో అనిశ్చితి: నియామక ప్రక్రియ పూర్తి కావస్తుందని నమ్మి కొందరు ర్యాంకర్లు తమ మునుపటి ఉద్యోగాలకు రాజీనామా చేశారని తెలిపారు. ఈ ఆలస్యం వారి కెరీర్‌లో తీవ్ర అనిశ్చితికి దారి తీసిందన్నారు. విలువైన సమయాన్ని, సర్వీసును, వయస్సును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

3) కుటుంబాల ఆందోళన: ఫలితాల రోజు ఆనందోత్సాహాలతో ఉన్న తమ కుటుంబాలు నేడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని వారు చెప్తున్నారు. తమ కుటుంబాలు తమపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ జాప్యం కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

4) రాష్ట్ర పాలనపై ప్రభావం: గ్రూప్-1 కేడర్ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన పాత్ర పోషిస్తాయని, రిక్రూట్‌మెంట్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే రాష్ట్ర పాలనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

5) తదుపరి నోటిఫికేషన్లపై ప్రభావం: రిక్రూట్‌మెంట్‌లో భారీ జాప్యాలు సాధారణంగా తదుపరి నోటిఫికేషన్‌ల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులను నిరుత్సాహపరుస్తాయి. ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *