- ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో టెన్షన్
- అనంతరం వరుస సంఘటనలతో భయం
- ఒక్కరోజే ఇండిగో, స్పైస్‌జెట్ లలో సమస్యలు
- విమానం ఎక్కేందుకు ప్రయాణికుల వెనుకంజ
- రైలు లేదా బస్సుల్లో ప్రయాణాలే బెస్ట్
- విదేశాలకు వెళ్లేందుకు టూరిస్టుల వెనుకంజ
సహనం వందే, హైదరాబాద్/ఢిల్లీ:
విమాన ప్రయాణం చేయాలంటే అనేకమంది భయపడుతున్నారు. అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం దేశంలో పలుచోట్ల నెలకొన్న సంఘటనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గురువారం వేర్వేరు చోట్ల రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6ఈ 2006), హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఈ రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పలు సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణీకులు విమానం ఎక్కాలంటే భయపడుతున్నారు.
విమాన ప్రయాణంపై పునరాలోచన…
రైలు లేదా బస్సులకు ఎక్కడన్నా ప్రమాదం జరిగినా కనీసం ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రాణం పోయినా శవమైనా కుటుంబ సభ్యులకు దొరుకుతుంది. కానీ విమాన ప్రమాదంలో పోతే తుక్కుతుక్కు కావాల్సిందే. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం కొన్ని అత్యవసర ల్యాండింగ్ సంఘటనలు ప్రయాణీకులకు ఇదే ఆలోచనను కలిగిస్తున్నాయి. గురువారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లేహ్‌కు బయలుదేరిన ఇండిగో విమానం లేహ్‌కు సమీపిస్తుండగా సాంకేతిక సమస్య ఎదుర్కొంది. ఈ విమానంలో సుమారు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన పైలట్… తక్షణమే ఢిల్లీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేశారు.
ఇండిగో ఘటన జరిగిన కొద్దిసేపటికే, హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానానికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు వెంటనే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి రావాలని నిర్ణయించారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ల సమయస్ఫూర్తితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అలాగే రెండు రోజుల క్రితం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం బాంబు బెదిరింపు కారణంగా నాగపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.
వరుస సంఘటనలకు కారణం ఏంటి?
అహ్మదాబాద్ ప్రమాదం అనంతరం వరుసగా ఇలా సంఘటనలు జరగటానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత పైలెట్లు, విమాన సిబ్బందిలో ఏమైనా మానసికంగా టెన్షన్ తలెత్తుతుందా? చిన్నపాటి సాంకేతిక సమస్యకు కూడా వాళ్లు టెన్షన్ పడి విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు.
ఈ వరుస ఘటనలు విమాన భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళనలను కలిగిస్తున్న మాట వాస్తవమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదని… గతంలో కూడా జరిగినట్లు ఆయన అంటున్నారు. అంతకైతే అప్పుడు ఈ సంఘటనలు వార్తలుగా బయటకు రాలేదని… ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో రోజుకు వేల విమానాలు ఆకాశంలో విహరిస్తుంటాయని… కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత…
వరుస సంఘటనలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ పైలట్లు, సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసించారు. ఈ సంఘటనలు విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో విమాన సిబ్బంది చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. విమాన ప్రమాదాలపై తరచుగా వార్తలు వస్తుండడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా సమాచారం. రైలు లేదా బస్సులో వెళ్లడమే బెస్ట్ అన్న భావన అనేకమందిలో తలెత్తుతుంది. కొందరు ఇప్పటికే విదేశాలకు పర్యాటకంగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకొని ఈ సంఘటనలతో రద్దు చేసుకున్నట్లు సమాచారం.