‘ఆ నూనె వాడితే ప్రాణాలేం పోవు’ – వ్యాపారి వ్యాఖ్య

  • గడువు తీరిన నూనెపై వ్యాపారి వ్యాఖ్య
  • రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • పలు నూనె బ్రాండెడ్ కంపెనీల ఇష్టారాజ్యం

సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక వినియోగదారుడికి ఎదురైన చేదు అనుభవం ఈ దారుణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ లో గారెలు చేసుకుని తినాలని ఆశగా నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన అతనికి, ఇంటికి వెళ్లాక చూసేసరికి ఆ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే ముగిసిందని తెలిసి షాకయ్యాడు.

వ్యాపారి అహంకారపూరిత సమాధానం…
ఆశ్చర్యపోయిన వినియోగదారుడు సదరు ఏజెన్సీ యజమానిని నిలదీయగా, అతని సమాధానం మరింత షాకింగ్‌గా ఉంది. ‘కాలం చెల్లిన నూనె తింటే వచ్చే నష్టమేమీ లేదు. కావాలంటే మా ఇంటికి రా… అదే నూనెతో వంటలు వండి తిని చూపిస్తానం’టూ దబాయించాడు. వ్యాపారి నిర్లక్ష్యానికి, అహంకారానికి ఇది పరాకాష్ట. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సెల్‌ఫోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విషపు నూనెల వ్యాపారం
పల్లెటూరు, పట్నం అనే తేడాల్లేకుండా రీఫైన్డ్ ఆయిల్ వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, ఇదే అదునుగా భావించిన కొందరు దుకాణ యజమానులు గడువు తీరిన ఆయిల్ ప్యాకెట్లను సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిర్మల్ జిల్లాలోనే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లోనూ గడువు తీరిన నూనె ప్యాకెట్లు యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలవి కూడా గడువు తీరినవి విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీలదీ బాధ్యతే…
ఈ వ్యవహారంపై కంపెనీ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ‘గడువు తీరిన వాటిని విక్రయించాలని తాము ఏమీ చెప్పడం లేదు… వ్యాపారులు విక్రయిస్తే తామేమి చేయగలమని’ కంపెనీ యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి. అయితే, వినియోగదారుల ఫోరం ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ‘గడువు తీరడానికి ముందే అటువంటి వాటిని వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత కంపెనీలదేన’ని స్పష్టం చేశారు. కాలం చెల్లిన నిత్యావసర సరుకులను విక్రయిస్తున్న వ్యాపారులపై, అలాగే దీనిని నియంత్రించడంలో విఫలమవుతున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *