- ముఖ్యమంత్రితో డాక్టర్ల సమస్యలు చర్చించా
- జూడా నేతలతో మంత్రి ప్రత్యేక సమావేశం
సహనం వందే, హైదరాబాద్:
జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి, సిఫార్సులతో సహా చర్చించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశ ఫలితాలు, తదుపరి చర్యలను వివరించడానికి 25న టీ-జుడా ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జూడా నాయకులు డాక్టర్ ఐజాక్ న్యూటన్ (అధ్యక్షులు), డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్ దుర్గం (ప్రధాన కార్యదర్శి), డాక్టర్ గిరి ప్రసాద్ (ఉపాధ్యక్షులు), డాక్టర్ సందీప్ (ఉపాధ్యక్షులు), డాక్టర్ వినయ్ కుమార్ (ప్రవక్త), డాక్టర్ అవినాష్ (ఉస్మానియా జూడా అధ్యక్షులు), డాక్టర్ కీర్తిక (ఉస్మానియా జూడా జాయింట్ సెక్రటరీ) పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్. చోంగ్తు కూడా పాల్గొన్నారు.
ఇటీవల జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యలపై తీసుకున్న చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి చూపిన చొరవ, ఇచ్చిన హామీలను తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం స్వాగతించింది. జూన్ 25న జరిగే తదుపరి సమావేశంలో జూనియర్ డాక్టర్లకు సానుకూల నిర్ణయాలు వెలువడతాయని ఆశిస్తున్నట్లు జూడా ప్రకటించింది.
జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లు…
- స్టైపెండ్ పెంచాలి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని స్టైపెండ్‌ను తక్షణమే పెంచాలి.
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా విద్య నాణ్యతను మెరుగుపరచాలి. రోగుల సంరక్షణను బలోపేతం చేయాలి.
- మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా శిక్షణ, పని వాతావరణాన్ని మెరుగుపరచాలి.