- పీకే ఆగ్రహం… థియేటర్లపై ఉక్కుపాదం
- ఆహార పదార్థాల ధరలపై విచారణకు ఆదేశం
- పవన్ మాటలతో ఏకీభవిస్తున్నా: దిల్ రాజు
సహనం వందే, అమరావతి/హైదరాబాద్:
సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగ్గుమంటున్నారు. తమ కూటమి ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవడం పైన… తన సినిమా విషయంలో అడ్డువస్తున్న వారిపట్ల ఆయన మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇతర సినీ పెద్దలపై కన్నెర చేశారు. పవన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల బంద్ అంశంతోపాటు సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలపై లోతుగా చర్చించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో తినిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
పవన్ మాటలతో ఏకీభవిస్తున్నా: దిల్ రాజు
సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. అలాగే, థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ కి సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి, ఒక సినిమా ఎంత కాలానికి ఓటీటీకి వెళ్ళాలనే అంశంపై కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సినీ వర్గాల వారికి సూచించారు. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత, ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందన్నారు.