- మంత్రివర్గ విస్తరణలో చోటుకు గట్టి ప్రయత్నం
- కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ తో భేటీ
- విజయశాంతికి ఏఐసీసీ అధిష్టానం సపోర్ట్
- ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలకు వివేక్ విందు
- ఎవరి ప్రయత్నాలు వారివే… సీఎం కినుక
- ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదా?
- ఒక మంత్రికి సినీ నటి సమంత ఎఫెక్ట్?
సహనం వందే, హైదరాబాద్:
మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశం అయింది. బీసీగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి అవకాశాలు సన్నగిల్లినట్లే. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి షరతు విధించారు. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో రెడ్డికి అంటే సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పిస్తే సమస్యగా మారుతుంది. ఇది మహేష్ కుమార్ గౌడ్ కి కలిసివచ్చే అవకాశం.
అలాగే వాకిటి శ్రీహరి, అమీర్ అలీఖాన్, వివేక్ పేర్లను ఎంపిక చేశారని తెలుస్తున్నది.
విజయశాంతికి అవకాశాలు మెండు…
ప్రముఖ సినీనటి విజయశాంతి పట్ల కాంగ్రెస్ అధిష్టానం అత్యంత సానుకూలంగా ఉంది. ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఒకప్పుడు కేసీఆర్ ను ఛాలెంజ్ చేసిన వనితగా ఆమెకు పేరు ఉంది. తెలంగాణ ఫ్లేవర్ విజయశాంతిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అధిష్టానం నమ్ముతుంది. అంతేకాదు ఒకప్పుడు ఎంపీగా పనిచేయడంతో ఆమెకు సోనియా గాంధీ వద్ద కూడా పరపతి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ నటరాజన్ కూడా ఎంపీగా పని చేశారు. ఆమెతో విజయశాంతికి మంచి పరిచయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కోర్ టీంలో నటరాజన్ కీలక నేత. ఏ రకంగా చూసినా విజయశాంతికి అవకాశాలు అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు. తన ప్రమేయం లేకుండా కొందరికి మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఆ మంత్రికి సమంత వివాదం ఎఫెక్ట్…
రాష్ట్రంలో ఒక మంత్రికి సినీనటి సమంత వివాదం మెడకు చుట్టుకునేటట్లు కనిపిస్తుంది. మంత్రి పదవికే ఎసరు వచ్చేటట్లు ఉంది. సమంతపై తీవ్రమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మంత్రిపై సమంత తనకు తెలిసిన కొందరు ప్రముఖుల ద్వారా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. దీంతో రాహుల్ గాంధీ ఆ మంత్రిని చివాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో ఆ మంత్రికి ఉద్వాసన తప్పదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి… ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఒకరి పట్ల ముఖ్యమంత్రి సహా అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో ఆయనకు కూడా మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదని అంటున్నారు.
కొందరికి బుజ్జగింపులు…
సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాని పలువురు ఆశావహులకు పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సదరు లీడర్లను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. ఒక వేళ ఆ లీడర్లు సంతృప్తి చెందక పేచీ పెడితే… విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాత చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతుండటంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశపెట్టారు. తనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు వద్దని మల్‌రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే తన అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్లు టాక్. కానీ మరోసారి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
ఎస్టీలకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్…
మంత్రివర్గంలో ఎస్టీ లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వర్గానికి మంత్రి పదవి దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలు నాయక్‌కు కేబినెట్ హోదాతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్‌లో జరిగే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో లంబాడాలకు మాత్రం మంత్రి పదవి ఇస్తామనే హామీని ఏఐసీసీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.