- కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై ప్రజారోగ్య విభాగం వసూళ్లు
- రోగులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినా చర్యలకు వెనకడుగు
- ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులను టచ్ చేయని యంత్రాంగం
- రోగులు చనిపోయినప్పటికీ డబ్బులు ఇస్తేనే శవాలు ఇచ్చారు
- అటువంటి ఆసుపత్రులపై చర్యలు కరువు… అందిన కాడికి దండుకున్న అధికారులు
- ఆనాటి ప్రజారోగ్య సంచాలకుడి పాత్రపై నిఘా…
సహనం వందే, హైదరాబాద్:
- అది కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలం… ప్రభుత్వ ఆసుపత్రులే కాదు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ పడకలు కూడా దొరకని దుస్థితి. ప్రపంచం, దేశం, రాష్ట్రం అంతా అల్లకల్లోలమే. అలాంటి సమయంలో తెలంగాణలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు కోవిడ్ సర్వీసుల పేరిట ఇష్టారాజ్యంగా రూ. లక్షలు వసూలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య పంచాలకుల విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానీ అప్పటికి ఆ విభాగం ఉన్నతాధికారి సంబంధిత ఆసుపత్రి యాజమాన్యానికి తూతూ మంత్రంగా నోటీసులు ఇస్తున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు. ఆ తర్వాత సదరు నోటీసులను రద్దు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్క ఆస్పత్రి నుంచే ఏకంగా రూ. 3 కోట్లు చడీచప్పుడు కాకుండా దండుకున్నట్లు తెలిసింది.
- ఇది మరో కార్పొరేట్ ఆసుపత్రి. హైదరాబాదుకు నడిబొడ్డున ఉంది. ఆ ఆసుపత్రిలో అనేకమంది కరోనా బాధితులు చనిపోయారు. అయినప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం గరిష్టంగా రూ. 20 లక్షల పైగా ఫీజుల ద్వారా వసూలు చేసింది. రోగులు చనిపోయినప్పటికీ డబ్బులు కడితేనే శవాలు ఇచ్చారు. వీటిపై ప్రజారోగ్య విభాగానికి ఫిర్యాదులు వచ్చాయి. మళ్లీ షరా మామూలే. ఆ యాజమాన్యంతో కుమ్మక్కైన ఒక వైద్యాధికారి ఏకంగా 3.5 కోట్ల రూపాయలు తీసుకున్నారు.
ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో 2020 నుంచి ప్రజారోగ్య విభాగం పరిధిలోని అనేకమంది జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై పడి అందినంత దోచుకున్నారు. రోగులకు సాయం చేయాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కాలంలో రూ.కోట్లు దండుకోవటమే పనిగా కొందరు అధికారులు వ్యవహరించారు. కరోనా చావులపై పైసలు ఏరుకున్నారు.
వందల ఫిర్యాదులు… చర్యలెక్కడ?
కరోనా సమయంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాయి. కొందరు రోగులు చనిపోయారు. చికిత్స సరిగా చేయకపోవడం వల్ల చనిపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీటికి సంబంధించి అనేక ఫిర్యాదులు ప్రజారోగ్య విభాగానికి వచ్చి చేరాయి. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ కూడా కేటాయించారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు కొన్ని ఆసుపత్రులు జవాబు ఇచ్చాయి.

మరికొన్ని బడా ఆసుపత్రులు పట్టించుకోలేదు. దీంతో అనేక ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రజారోగ్య విభాగం అధికారులు కొందరు కుమ్మక్కైనట్లు విమర్శలు వచ్చాయి. అప్పటి ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విజిలెన్స్ కందిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఒక అంచనా ప్రకారం కరోనా కాలంలో దాదాపు రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఏకంగా రూ. 450 కోట్లకు పైగే వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై విజిలెన్స్ వర్గాలు దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
నకిలీ డాక్టర్లపై చర్యలు శూన్యం…
కరోనా సమయంలో నకిలీ డాక్టర్లు విచ్చలవిడిగా వైద్యం చేసినా, వైద్య ఆరోగ్య శాఖ చూసీచూడనట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లాల్లో నకిలీ డాక్టర్లు పెచ్చరిల్లినా, వారిపై చర్యలు తీసుకునే నాధుడు లేకుండా పోయాడు. అర్హత లేని వైద్యులు రోగులపై ప్రయోగాలు చేసిన సందర్భాలు ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధితులకు న్యాయం దక్కలేదు. అనేక జిల్లాల్లో వైద్యాధికారులు ఇష్టారాజ్యంగా ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారు. అర్హతలు లేనప్పటికీ లైసెన్సులు జారీ చేశారు. కొందరు డాక్టర్లు డిగ్రీలు లేకపోయినా లైసెన్సులు పొందారు. వీటన్నిటికీ జిల్లా అధికారులు డబ్బులు వసూలు చేసి తమపై అధికారులకు కమీషన్లుకు అందజేశారు.
_____________________________________________________________________________________________________
కరోనాతో రాజకీయం… సేవ ముసుగులో దోపిడి’పై స్టోరీ రేపటి సంచికలో…