జడ్జి ఆదర్శం… నేతల ధిక్కారం

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సపై అయిష్టత
  • మంత్రులు, ఎమ్మెల్యేలంతా కార్పొరేట్ భజనే
  • ఇక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదీ అదేతీరు
  • ప్రభుత్వ ఆసుపత్రులపై గొప్పలు చెబుతారు
  • కానీ ఆచరణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే చికిత్స
  • మంత్రుల వల్లే సర్కారు దవఖానాల్లో నిర్లక్ష్యం
  • జడ్జీని చూసి ఇప్పుడైనా వెళ్లే దమ్ముందా?
  • వీవీఐపీలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే జనం సెల్యూట్ కొడతారు

వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదర్శవంతంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు మంత్రి చెప్పారు. కానీ గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అంతంత మాత్రంగానే సేవలు ఇస్తుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు యశోద, అపోలో వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలతో చికిత్స తీసుకుంటున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారైనా గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారా? ఆయన యశోద ఏఐజీ ఆసుపత్రులకు వెళ్లేవారు. పరోక్షంగా వాటిని ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో పేదలకు, వీఐపీలకు ఇంత అసమానత ఎందుకు?

జడ్జి ఆదర్శం… నాయకులకు ఎందుకు లేదు?
వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జి జ్యోతిర్మయి సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. జ్యోతిర్మయి నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడం ఆదర్శవంతం. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను ఎందుకు నమ్మరు? జ్యోతిర్మయి లాంటి జడ్జి ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించగలిగితే, నాయకులు ఎందుకు యశోద, అపోలోలను ఎంచుకుంటారు? ఈ అసమానత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?

గాంధీ ఆసుపత్రి… గత్యంతరం లేని పేదలు
తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ వైద్య కేంద్రమైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, కాకతీయ సహా జిల్లా కేంద్ర ఆస్పత్రుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. చెత్తతో నిండిన కారిడార్లు, పనిచేయని వైద్య పరికరాలు, మందుల కొరత, డాక్టర్ల నిర్లక్ష్యం… ఇవన్నీ ఆస్పత్రుల్లో దర్శనమిస్తుంటాయి. రోగులు నేలపై పడుకుని చికిత్స కోసం ఎదురుచూస్తారు. శుభ్రత లోపం, ఆక్సిజన్ సిలిండర్లు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. పేదలు ఈ పరిస్థితుల్లో చికిత్స కోసం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే నాయకులు పట్టించుకోరు.

యశోద ఆసుపత్రి: వీఐపీలకు విలాసం
యశోద ఆసుపత్రి ఐదు నక్షత్రాల హోటల్‌ను తలపిస్తుంది. శుభ్రమైన కారిడార్లు, ఆధునిక స్కానర్లు, రోబోటిక్ సర్జరీ పరికరాలు, ఏసీ గదులు, 24 గంటలూ స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు—ఇవన్నీ వీఐపీలకు స్వర్గాన్ని అందిస్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడే చికిత్స తీసుకుంటారు. ఒక ఆపరేషన్‌కు 20 లక్షల రూపాయల బిల్లు వచ్చినా, అది ప్రజల పన్నులతో చెల్లిస్తారు. గాంధీ ఆసుపత్రితో యశోదను పోల్చితే, పేదలకు నిరాశ, వీఐపీలకు విలాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అసమానతలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.

ప్రజాధనం దుర్వినియోగం ఇంకెంతకాలం?
వీఐపీలు యశోద, ఏఐజీ, అపోలోలలో చికిత్స తీసుకుంటే లక్షలు, కోట్ల బిల్లులు పేదల పన్నులతో చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ. 10 లక్షల లిమిట్ ఉంటే, వీఐపీలకు ఎలాంటి పరిమితి లేదు. గత ఐదేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీఐపీల చికిత్సలకు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ డబ్బుతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి మార్చవచ్చు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ, పేదలకు నాసిరకం వైద్యం అందించడం న్యాయమా? ఈ దుర్వినియోగం ఎంతకాలం కొనసాగుతుంది?

విదేశాల నుంచి నేర్చుకోండి..‌.
స్వీడన్‌లో ప్రధానమంత్రి, మంత్రులు కరోలిన్‌స్కా యూనివర్సిటీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటారు, ఎందుకంటే అవి అత్యాధునికం. న్యూజిలాండ్‌లో జసిందా ఆర్డెర్న్ ఆక్లాండ్ సిటీ హాస్పిటల్‌లో ప్రసవం చేయించుకున్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో, వెనిజులాలో హ్యూగో చావెజ్ ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మేవారు. ఈ దేశాల నాయకులు తమ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, నమ్మకంగా చికిత్స తీసుకుంటారు. అంతెందుకు కేంద్ర ప్రభుత్వంలోనే అనేకమంది అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతారు. కానీ తెలంగాణలో నాయకులు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తూ, యశోద, ఏఐజీలలో చికిత్స తీసుకుంటారు. ఈ దేశాల నుంచి మనం ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదా?

గాంధీలో చికిత్స చేయించుకునే ధైర్యం ఉందా?
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులారా… మీకు, మీ కుటుంబానికి చిన్న జబ్బు వచ్చినా గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి. జ్యోతిర్మయి లాంటి జడ్జి ప్రభుత్వ ఆసుపత్రిని నమ్మగలిగితే, మీరు ఎందుకు నమ్మలేరు? మీరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే, డాక్టర్లు సమయానికి వస్తారు, మందులు దొరుకుతాయి, పరికరాలు ‌సరిచేస్తారు, శుభ్రత పెరుగుతుంది. ఈ సవాల్ స్వీకరించకపోతే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు దిక్కు లేకుండా పోతాయి. ధైర్యం ఉంటే గాంధీలో అడుగు పెట్టండి! ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తయారు చేశామని చెబుతుంటారు కదా… అలాంటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం రావడానికి మీకెందుకు బాధ?

పేదల ప్రాణాలకు విలువ లేదా?
ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తామని చెప్పడం కేవలం మాటలే. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పరిస్థితి నాయకుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. పేదలు నాసిరకం వైద్యంతో ఇబ్బందులు పడుతుంటే వీఐపీలు యశోద, అపోలోలో విలాసవంతమైన చికిత్స తీసుకుంటున్నారు. గతంలో ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మలేదు. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడం అసాధ్యం కాదు. కానీ నాయకులకు చిత్తశుద్ధి కావాలి. స్వీడన్, క్యూబా, న్యూజిలాండ్ నుంచి నేర్చుకోండి. గాంధీలో చికిత్స చేయించుకోండి. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం మానండి. జ్యోతిర్మయి ఆదర్శాన్ని అనుసరించి పేదలకు, వీఐపీలకు సమానమైన వైద్యం అందేలా చూడండి! మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూలు కడితే… జనం మీకు సెల్యూట్ చేస్తారు.

0
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *