‘కామ్రేడ్ కళ్యాణ్’ కితకితలు – 90ల నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో నవ్వులు

Comrade Kalyan Movie Review
  • శ్రీవిష్ణు ఫుల్ ఆన్ కామెడీ మానియా
  • రాధిక, సత్య మార్క్ హ్యూమర్
  • ప్రథమార్ధం ట్విస్టులతో సాగే వినోదాత్మక లవ్
  • వీకెండ్‌కు మైండ్ ఫ్రీ ఎంటర్‌టైనర్
  • సినిమా రివ్యూ రేటింగ్: 2.75/5

సహనం వందే, హైదరాబాద్:

1990ల కాలంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంత నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నక్సలిజం ఊపందుకున్న రోజుల్లో కళ్యాణ్ అనే యువకుడు పాతబడ్డ థియేటర్‌లో కేవలం ఆర్‌ నారాయణమూర్తి సినిమాలు ప్రదర్శిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నా తన వ్యాపారం చేసుకుంటూ సరదాగా గడిపేస్తుంటాడు. కథలోకి కథానాయిక ప్రవేశించి, ఆమెను ప్రేమించడంతో కళ్యాణ్ జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె వల్ల ఒక పెద్ద సమస్యలో చిక్కుకుని, నక్సలైట్లు-పోలీసుల మధ్య నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె ఎవరు, ఈ వివాదంలోకి కళ్యాణ్‌ను ఎందుకు నెట్టిందనే లవ్ ట్రాక్ డ్రామా ఆసక్తిని పెంచుతుంది.

శ్రీవిష్ణు నటన, ప్రథమార్ధంలో వినోదం
శ్రీవిష్ణు తనదైన నటనతో కళ్యాణ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. సరదా సంభాషణలు, టైమింగ్, డైలాగ్ డెలివరీ, మార్క్ మేనరిజమ్స్‌తో నవ్వులు పూయించి కథను ముందుకు నడిపించారు. కథానాయిక మహిమా నంబియార్ పరిధి మేరకు చక్కగా నటించినా, ప్రేమకథలో లోతు లేక స్కోప్ తగ్గింది. కళ్యాణ్ తల్లిగా నటించిన రాధికా శరత్‌కుమార్ బాలకృష్ణ అభిమానిగా, పేకాట రాయుడిగా చెప్పే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు జానకీరామ్ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌ను కామెడీగా చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రథమార్ధాన్ని సరదా వన్ లైనర్లతో వేగంగా నడిపారు. ఫ్రెండ్ తెలుగు ప్రేమలేఖను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తూ ‘పండు వెన్నెల’ను ‘ఫ్రూట్ మూన్‌లైట్’ అని మార్చే సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.

నటీనటుల సపోర్ట్… కామెడీ ట్రాక్
ఈ సినిమాలో నటీనటుల బలమైన సపోర్టింగ్ కాస్ట్ పెద్ద ప్లస్ పాయింట్. సత్య, షైన్ టామ్ చాకో, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, శత్రు కీలక పాత్రల్లో కనిపించారు. సత్య కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల బాగా పేలింది. పొట్టిగా ఉండే వడ్డీ వ్యాపారి క్యారెక్టర్ కోసం అసిస్టెంట్ స్టూల్ పట్టుకుని తిరిగే కామెడీ బ్లాక్ అందరినీ నవ్విస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై మంచి అంచనాలు పెంచుతుంది.

ద్వితీయార్థం సవాలు…
ద్వితీయార్థంలో సినిమా కాస్త పట్టు సడలి, క్లైమాక్స్ సీన్లు రొటీన్‌గా, ఊహకు అందేలా మారిపోయాయి. కథనంలో స్పష్టత లేకపోవడంతో కొన్ని క్యారెక్టర్లు సరిగ్గా వాడుకోలేదు. విలన్‌గా చేసిన షైన్ టామ్ చాకో పాత్రను ఇంకా శక్తివంతంగా తీర్చిదిద్ది ఉండాల్సింది. సాంకేతికంగా సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం, అడవుల్లో తీసిన సీన్స్ 90ల ఏజెన్సీ వాతావరణాన్ని విజువల్‌గా ఆవిష్కరించాయి. విజయ్ బుల్గానిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిపోయింది. కోనా వెంకట్ స్క్రీన్‌ప్లే, భాను-నందుల సంభాషణలు కామెడీ భాగాల్లో మెరిసాయి.

లాజిక్ లేని సరదా ఎంటర్‌టైనర్
కామ్రేడ్ కళ్యాణ్ అనేది లాజిక్‌లు వెతక్కుండా కేవలం వినోదం కోసం చూసే ప్రేక్షకులకు మంచి ఛాయిస్. శ్రీవిష్ణు టైమింగ్, రాధిక కామెడీ, సత్య హాస్యం మొదటి భాగంలో బాగా అలరిస్తాయి. కొన్ని చిన్నపాటి లోపాలు పక్కన పెడితే వీకెండ్‌లో సరదాగా థియేటర్‌కు వెళ్లి నవ్వుకోవడానికి ఈ చిత్రం ఉపయోగపడుతుంది. లోతైన కథల కంటే కూడా కలకాలం నిలిచే నవ్వులే ముఖ్యం అనుకునేవారికి ఈ సినిమా సరైన ఎంజాయ్‌మెంట్ ఇస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *