- నమ్మకం కోల్పోయిన ప్రముఖ ఏజెన్సీలు
- ఓటరు నాడి చిక్కడంలేదు… చెప్పడం లేదు
- గణాంకాల గందరగోళం పెరిగింది
- విశ్వసనీయత పెద్ద ప్రశ్నార్థకం
- రేపు వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
సహనం వందే, హైదరాబాద్:
ఎన్నికల ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు నవ్వులపాలవుతున్నాయి. గెలుపు గుర్రాలను పసిగట్టడంలో దిగ్గజ సంస్థలు సైతం బోల్తా కొడుతున్నాయి. ఓటరు నాడి పట్టుకున్నామని చెప్పుకునే జ్యోతిష్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ప్రజా తీర్పునకు ఈ అంకెలకు పొంతన లేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంచనాలు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయో లోతైన విశ్లేషణతో కూడిన కథనం మీకోసం.
గణాంకాల గడబిడ
సోమవారం (4న) ఫలితాలు రాబోతున్నాయి. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు బెంగాల్ భవితవ్యం తేలనుంది. అప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే గణాంకాలు కేవలం వినోదం కోసమే తప్ప వాస్తవాలకు దూరంగా ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి. గతంలో అనేక అసెంబ్లీ ఎన్నికల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. 2023లో ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో చాలా సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా వాస్తవ ఫలితాల్లో బీజేపీ 54 సీట్లతో జయకేతనం ఎగురవేసింది. మధ్యప్రదేశ్‌లో సైతం గట్టి పోటీ ఉంటుందని అంచనా వేయగా బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధించింది. రాజస్థాన్‌లో కూడా 115 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాగా పోల్స్ మాత్రం హంగ్ వస్తుందని తప్పుడు అంచనాలు ఇచ్చాయి.

లోక్‌సభ సీట్ల లెక్కలు గల్లంతు
2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తంతు పునరావృతమైంది. ఎన్డీయే కూటమి 400 దాటేస్తుందని అనేక సంస్థలు ఊదరగొట్టాయి. కొన్ని సర్వేలు అయితే 350 నుండి 370 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. కానీ ఫలితాలు చూస్తే ఎన్డీయే 293 దగ్గరే ఆగిపోయింది. బీజేపీకి సొంతంగా మెజారిటీ కూడా రాలేదు. 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు ఇండియా కూటమి అనూహ్యంగా 235 సీట్లు గెలుచుకుంది.
బీహార్‌లోనూ అదే పరిస్థితి…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సంస్థలు తడబడ్డాయి. గెలిచేది ఎవరన్నది సరిగ్గా చెప్పినా సీట్ల సంఖ్యలో మాత్రం ఆకాశానికి నిచ్చెన వేశాయి. ఎన్డీయే 200 సీట్లు దాటుతుందని చెప్పిన అంచనాలు నిజం కాలేదు. యాక్సిస్ మై ఇండియా వంటి దిగ్గజ సంస్థలు కూడా అక్కడ తప్పులో కాలేశాయి. ఓట్ల శాతం సీట్లుగా మారే క్రమంలో ఉండే సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో ఇవి విఫలమవుతున్నాయి. ప్రజల మూడ్‌ను అంకెల్లో బంధించడం అసాధ్యమని తేలిపోయింది.
లక్షల్లో ఓటర్లు… వందల్లో శాంపిల్స్
సర్వే సంస్థలు ఎంచుకునే శాంపిల్ సైజ్ లేదా నమూనాల పరిమాణంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. కోట్లాది మంది ఓటర్లలో కేవలం కొన్ని వేల మందిని మాత్రమే అడిగి ఫలితాన్ని తేల్చేయడంతో అభాసు పాలవుతుంది. గ్రామీణ, పట్టణ ఓటర్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడంలో ఈ సంస్థలు విఫలమవుతున్నాయి. ఒక నియోజకవర్గంలో సగటున 2 లక్షల ఓటర్లు ఉంటే అక్కడ కేవలం 100 నుండి 200 మంది అభిప్రాయం తీసుకుని మొత్తం ఫలితాన్ని అంచనా వేయడం వల్ల తప్పులు దొర్లే అవకాశం 95 శాతానికి పైగా ఉంటోంది.
రాజకీయ పక్షపాత ధోరణి
చాలా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా గణాంకాలను సృష్టిస్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి 148 సీట్లు వస్తాయని కొన్ని సంస్థలు చెప్పగా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 215 సీట్లతో గెలిచింది. ఈ వ్యత్యాసం కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసేలా ఈ అంకెల గారడీ సాగుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సైలెంట్ ఓటర్…
నేటి ఓటరు చాలా తెలివైనవాడు. పోలింగ్ కేంద్రం బయట సర్వే ప్రతినిధి అడిగినప్పుడు తన నిజమైన అభిప్రాయాన్ని చెప్పడం లేదు. దీనిని ‘సైలెంట్ ఓటర్’ ప్రభావంగా పిలుస్తారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు తమ ఓటు ఎవరికి వేశారో బయటకు చెప్పడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ఏ సంస్థ అయితే నిజాయితీగా, వివక్ష లేకుండా గణాంకాలను సేకరిస్తుందో వారికే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం వినోద కార్యక్రమాలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్