నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్లు – మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హామీ

Housing Plots to Journalists
  • జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలతో ప్రత్యేక భేటీ
  • ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సంసిద్ధత
  • తెలంగాణ ఆవిర్భావం రోజున ఇచ్చే ఛాన్స్

సహనం వందే, హైదరాబాద్:

దశాబ్దాల కాలంగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల సాకారం కాబోతోంది. కలం వీరుల పోరాటానికి కాలం కలిసి వస్తోంది. న్యాయవివాదాల సుడిగుండంలో చిక్కుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు సర్కారు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. జూన్ 2వ తేదీ నాటికి ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తామని ప్రకటించి జర్నలిస్టుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది.

Ponguleti Meeting with Journalist Housing Societies

పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఒక కీలక భేటీ జరిగింది. రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరిస్తామని ఆయన వెల్లడించారు. వచ్చేనెల 2వ తేదీ నాటికి ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

నాలుగు సొసైటీలతో సమావేశం…
ఈ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ, డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ, తెలంగాణ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ నాలుగు సొసైటీలపై మంత్రి ఆరా తీశారు. సభ్యుల సంఖ్య, అర్హతలపై లోతైన చర్చ జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ సొసైటీ మినహా మిగిలిన మూడు సొసైటీల్లో సుమారు 2,424 మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జేఏసీ ఏర్పాటుకు సూచన
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అందరూ ఒకే తాటిపైకి రావాలని మంత్రి సూచించారు. అన్ని సొసైటీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఏ సంఘంలోనూ సభ్యత్వం లేని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ సహకరిస్తేనే అనుకున్న సమయానికి ఇళ్ల స్థలాల పంపిణీ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

పాత గాయాల గుర్తు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు జర్నలిస్టులకు చేసిన మేలును మంత్రి గుర్తు చేశారు. ముఖ్యంగా 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ సొసైటీ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో రవీంద్రభారతిలో జర్నలిస్టుల కుటుంబాలతో సమావేశమై భూమి అప్పగించినా న్యాయ వివాదాల వల్ల సమస్య మొదటికి వచ్చిందని ఆయన వాపోయారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి దశాబ్దాల పెండింగ్ సమస్యను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

ఫ్యూచర్ సిటీలో చోటు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్లకు ఇచ్చే ప్రాంతంలోనే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇది శుభవార్త అని చెప్పవచ్చు. దీనిపై ప్రభుత్వం చాలా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం రోజు జూన్ 2వ తేదీ నాటికి ఈ ఫైల్‌పై తుది నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.

జవహర్‌లాల్ సొసైటీ తీర్మానం
జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 18 ఏళ్ల క్రితమే ప్రతి సభ్యుడు 2 లక్షల రూపాయల చొప్పున చెల్లించిన విషయాన్ని ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సుదీర్ఘ నిరీక్షణను గుర్తించి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, స్పెషల్ కమిషనర్ జి. ముకుంద రెడ్డి, సీపీఆర్వో మల్సూర్, డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, ఇతర హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు సూరజ్, శ్రీకాంత్ రావు, విరాహత్ అలీ, రవికాంత్ రెడ్డి, మురళీకృష్ణ, సురేష్ బాబు, నేమాని భాస్కర్, గోపరాజు, హష్మీ, రవీంద్ర బాబు, రాకేష్, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *