- ఢిల్లీలో యువ సివిల్ జడ్జి ఆత్మహత్య
- భార్య జడ్జి… మరదలు ఐఏఎస్
- ఆత్మహత్యపై అనుమానాలు
సహనం వందే, న్యూఢిల్లీ:
న్యాయం చెప్పాల్సిన సీటులో ఉన్న వ్యక్తికే అన్యాయం జరిగింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 30 ఏళ్ల యువ జడ్జి అమన్ కుమార్ శర్మ తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం దేశ రాజధానిని కుదిపేస్తోంది. భార్య, మరదలి వేధింపులే దీనికి కారణమంటూ కుటుంబం చేస్తున్న ఆరోపణలు వ్యవస్థలో కలకలం రేపుతున్నాయి. ఉన్నతాధికారుల అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందా?
చనిపోయే ముందు తండ్రికి ఫోన్
అమన్ కుమార్ శర్మ ప్రాణాలు తీసుకునే ముందు తన తండ్రికి ఫోన్ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో అల్వార్‌లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి తన ఆవేదన పంచుకున్నారు. తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, జీవించడం కష్టంగా ఉందని వాపోయారు. తండ్రి వెంటనే అల్వార్ నుండి బయలుదేరి అర్ధరాత్రి 12 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. అప్పటికే అమన్ మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
భార్య, మరదళ్ల టార్గెట్
అమన్ భార్య స్వాతి కూడా జుడీషియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు జమ్మూలో ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్న మరదలు నిధి మాలిక్ కూడా అమన్‌ను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత 2 నెలల నుండి తన ఇంట్లో నిధి మాలిక్ జోక్యం ఎక్కువైందని అమన్ తన తండ్రికి చెప్పారు. నిధి మాలిక్ తన ఇంటిని నియంత్రిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల హోదాను అడ్డం పెట్టుకుని వేధించారని కుటుంబం ఆరోపిస్తోంది.
ఆఖరి నిమిషంలో గొడవ
మరుసటి రోజు ఉదయం ఇంట్లో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. అమన్ తండ్రిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని స్వాతి గట్టిగా అరిచారు. వెళ్ళకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె బెదిరించినట్లు తండ్రి చెబుతున్నారు. స్వాతి కోపంతో కేకలు వేస్తుంటే అమన్ ఏడుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత గదిలో శబ్దం ఆగిపోయింది. గొడవ సద్దుమణిగిందని తండ్రి భావించినా లోపల ఘోరం జరిగిపోయింది.
బాత్రూంలో శవం
అమన్ ఎక్కడ అని స్వాతిని అడిగితే తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చారు. అమన్ మొబైల్ ఫోన్‌కు తండ్రి ఫోన్ చేయగా బాత్రూం లోపల రింగ్ వినిపించింది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. పక్కింటి వారు నిచ్చెన తీసుకురాగా గార్డు శంకర్ షాఫ్ట్ కిటికీ ద్వారా లోపలికి వెళ్లారు. అక్కడ అమన్ ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు మృతి చెందినట్లు ప్రకటించారు.
న్యాయవాద ప్రస్థానం
అమన్ కుమార్ శర్మ ప్రతిభావంతుడైన న్యాయాధికారి. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ నుండి 2018లో లా పట్టా పొందారు. 2021లో ఢిల్లీ జుడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. సివిల్, క్రిమినల్ కేసులను డీల్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. 2025 నుండి కర్కర్డూమా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి గృహ హింసకు బలికావడం విషాదకరం.
దర్యాప్తులో పోలీసుల వేగం
ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై విచారణ వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి కుట్ర కోణం బయటపడలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అందరి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. న్యాయ, పాలనా విభాగాల్లోని వ్యక్తుల పేర్లు బయటకు రావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.